ఉదయనిధి సంచలన వ్యాఖ్యలు.. హిందూ సంఘాల ఆగ్రహ జ్వాలలు
సనాతన ధర్మం సామాజిక న్యాయానికి వ్యతిరేకమని పేర్కొన్నారు ఉదయనిధి. సనాతనాన్ని కేవలం వ్యతిరేకించడమే కాదని.. పూర్తిగా తొలగించాలని అన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, ఆ రాష్ట్ర యువజన, క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘తమిళనాడు ప్రోగ్రెసివ్ రైటర్స్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సనాతన నిర్మూలన’ అనే సబ్జెక్ట్ పై సదస్సు నిర్వహించగా.. సనాతనాన్ని నిర్మూలించాల్సిందేనని ఉదయనిధి తేల్చి చెప్పారు. దీంతో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
సనాతన ధర్మం సామాజిక న్యాయానికి వ్యతిరేకమని పేర్కొన్నారు ఉదయనిధి. సనాతనాన్ని కేవలం వ్యతిరేకించడమే కాదని.. పూర్తిగా తొలగించాలని అన్నారు. అది తిరోగమన సంస్కృతి అని పేర్కొన్నారు. సమానత్వానికి, మహిళా సాధికారతకు సనాతన ధర్మం వ్యతిరేకమన్నారు. అది మలేరియా, డెంగీ, కరోనా లాంటిందని అన్నారు. ఉదయనిధి వ్యాఖ్యలు.. మీడియా, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
బీజేపీ నేతలు ధర్మేంద్ర ప్రధాన్, షానవాజ్ హుస్సేన్.. ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ఈ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. సనాతన ధర్మం శాశ్వతమైనదని, ఇలాంటి రాజకీయపరమైన వ్యాఖ్యల వల్ల దానికి ఏమీ జరగబోదన్నారు. ఈ వ్యాఖ్యలపై డీఎంకే తరపున ఇంకా ఎలాంటి స్పందన లేదు.