జేఈఈ మెయిన్స్ లో తెలుగు విద్యార్థుల సత్తా
దేశవ్యాప్తంగా 14 మంది విద్యార్థులకు వందశాతం పర్సంటైల్
జేఈఈ (మెయిన్స్) ఫలితాల్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు వంద శాతం పర్సంటైల్ సాధించారు. దేశవ్యాప్తంగా మొత్తం 14 మంది విద్యార్థులకు వందశాతం పర్సంటైల్ వచ్చిందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ (మెయిన్స్) -2025 ఫలితాలను మంగళవారం ప్రకటించారు. జనవరి 22 నుంచి 29 వరకు ఐదు రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహించారు. జేఈఈ మెయిన్స్ కోసం దేశవ్యాప్తంగా 13,11,544 మంది రిజిస్టర్ చేసుకోగా 12,58,136 మంది పరీక్ష రాశారు. తెలంగాణకు చెందిన బని బ్రాత మాజీ, ఏపీకి చెందిన సామి మనోజ్ఞ సహా మొత్తం 14 మంది విద్యార్థులు వంద శాతం పర్సంటైల్ సాధించారు. రాజస్ధాన్ నుంచి ఐదుగురు, ఢిల్లీ నుంచి ఇద్దరు, ఉత్తర ప్రదేశ్ నుంచి ఇద్దరు, మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్ నుంచి ఒక్కో విద్యార్థి వంద శాతం స్కోర్ సాధించారు.