స్మార్ట్ ఫోన్ కొంటే 2 కేజీలు టమాటాలు ఫ్రీ..
పెరిగిన టమాటా ధరలు సామాన్యుడికి చుక్కలు చూపెడుతున్నాయి. టమటా లెస్ కర్రీలను జనాలు అలవాటు చేసుకుంటున్నారు కూడా. ఈ హాట్ టాపిక్ ని ప్రచార అస్త్రంగా మార్చుకున్నాడు అశోక్ అగర్వాల్ అనే యువకుడు.
బోడిగుండుకి మోకాలుకి లంకె అంటే ఇదేనేమో.. టూత్ పేస్ట్ కొంటే ఎక్కడైనా బ్రష్ ఫ్రీగా ఇస్తారు. సోప్ కొంటే సోప్ బాక్స్, చికెన్ కొంటే కోడిగుడ్లు.. ఇలాంటి ఆఫర్లు కూడా మనకు తెలుసు. స్మార్ట్ ఫోన్లు వచ్చాక వాటి కొనుగోలుతో ఇయర్ ఫోన్లు, బ్లూటూత్ ఫ్రీగా ఇవ్వడం రివాజుగా మారింది. కానీ స్మార్ట్ ఫోన్లకి టమాటాలు ఫ్రీగా ఇస్తూ ఓ షాపు యజమాని వార్తల్లోకెక్కాడు. మధ్యప్రదేశ్ లోని అశోక్ నగర్ లో ఓ సెల్ ఫోన్ షాపు టమాటాలు ఉచితంగా ఇస్తూ బోలెడంత ప్రచారం సంపాదించింది.
పెరిగిన టమాటా ధరలు సామాన్యుడికి చుక్కలు చూపెడుతున్నాయి. టమటా లెస్ కర్రీలను జనాలు అలవాటు చేసుకుంటున్నారు కూడా. ఈ హాట్ టాపిక్ ని తనకు ప్రచార అస్త్రంగా మార్చుకున్నాడు అశోక్ అగర్వాల్ అనే యువకుడు. అతనికి సెల్ ఫోన్ షాపు ఉంది. ఆ షాపులో కొత్తగా ఓ ఆఫర్ ప్రకటించారు. ప్రతి స్మార్ట్ ఫోన్ కి 2 కేజీల టమాటాలు ఫ్రీ అని ప్రచారం చేశాడు. ఇంకేముంది షాపు ముందు జనం పోగయ్యారు.
ఆ ఊరిలో స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నవారు నేరుగా అశోక్ అగర్వాల్ షాపుకే వెళ్తున్నారు. ఫోన్ తో పాటు 2 కేజీల టమాటాలు కూడా ఉచితంగా తెచ్చుకుంటున్నారు. 2 కేజీల టమాటాలు ఉచితం అంటే.. దాదాపు 300 నుంచి 400 రూపాయల వరకు గిట్టుబాటు అయినట్టే లెక్క. అందుకే కస్టమర్లు కూడా మిగతా షాపులకు వెళ్లకుండా ఫోన్లు కొనేందుకు అక్కడికే వస్తున్నారు. ఈ ఆఫర్ తో తనకు కస్టమర్ల సంఖ్య కూడా పెరిగిందంటున్నాడు అశోక్.