తమిళనాడు, కేరళలో నిరసనలు...''ది కేరళ స్టోరీ'' షోలు రద్దు
‘ది కేరళ స్టోరీ’ విడుదలకు వ్యతిరేకంగా తమిళనాడులోని నామ్ తమిళర్ కట్చి (NTK) చెన్నైలో నిరసనకు దిగింది. ఈ చిత్రానికి వ్యతిరేకంగా చెన్నైలోని స్కైవాక్ మాల్ సమీపంలోని అన్నానగర్ ఆర్చ్‌లో నామ్ తమిళర్ పార్టీ అధ్యక్షుడు, నటుడు, దర్శకుడు సీమాన్ నేతృత్వంలోని కార్యకర్తలు నిరసనలు ప్రారంభించారు.
'ది కేరళ స్టోరీ' వివాదం రగులుతూనే ఉంది. ఈ మూవీ ప్రజల మధ్య విభజనలు తీసుకరావడం కోసం అబద్దాలు ప్రచారం చేస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. దీని వెనక ఆరెస్సెస్ , బీజేపీలున్నాయని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే కేరళలో పెద్ద ఎత్తున నిరసనలు సాగుతుండగా ఇప్పుడు తమిళనాడులో కూడా నిరసనలు మొదలయ్యాయి.
‘ది కేరళ స్టోరీ’ విడుదలకు వ్యతిరేకంగా తమిళనాడులోని నామ్ తమిళర్ కట్చి (NTK) చెన్నైలో నిరసనకు దిగింది. ఈ చిత్రానికి వ్యతిరేకంగా చెన్నైలోని స్కైవాక్ మాల్ సమీపంలోని అన్నానగర్ ఆర్చ్‌లో నామ్ తమిళర్ పార్టీ అధ్యక్షుడు, నటుడు, దర్శకుడు సీమాన్ నేతృత్వంలోని కార్యకర్తలు నిరసనలు ప్రారంభించారు.
నిరసనలు తెలపాలని సీమాన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో, NTK కార్యకర్తలు ది కేరళ స్టోరీని ప్రదర్శించడాన్ని వ్యతిరేకిస్తూ అనేక థియేటర్ ల ముందు నిరసన చేపట్టారు.
పార్టీ శ్రేణులు నామ్ తమిజర్ కట్చి జెండాలు ప్రదర్శిస్తూ సినిమాను బ్యాన్ చేయాలంటూ నినాదాలు చేశారు. 'ది కేరళ స్టోరీ' చిత్రాన్ని నడపవద్దని సీమాన్ థియేటర్ యజమానులకు విజ్ఞప్తి చేశారు. ఆ సినిమాను బహిష్కరించాలని ఆయన ప్రజలను కోరారు.
కేరళ స్టోరీ ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా ఉందని, పుదుచ్చేరి, తమిళనాడు ప్రభుత్వాలు దాని ప్రదర్శనను నిషేధించాలని డిమాండ్ చేస్తూ సీమాన్ కొద్ది రోజుల క్రితం కూడా నిరసనలు చేపట్టారు
తమిళనాడులో నిరసన ప్రదర్శనలు, సినిమాకు వస్తున్న పేలవమైన స్పందన వల్ల అనేక మల్టీప్లెక్స్ థియేటర్లు ఈ రోజు నుండి కేరళ స్టోరీ ప్రదర్శనలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి.
కాగా, కేరళలో కూడా అనేక జిల్లాల్లో 'కేరళ స్టోరీ' షోలు రద్దు చేశారు. కొచ్చిలో పలు షోలు రద్దు చేశారు. కొచ్చిలోని లులు మాల్, సెంటర్ స్క్వేర్ మాల్ థియేటర్ల యజమానులు కూడా సినిమాను బహిష్కరించారు. అలాగే కొల్లం, పతనంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి, కన్నూర్, వాయనాడ్ జిల్లాల్లోని థియేటర్లలో కూడా సినిమాను ప్రదర్శించకూడదని నిర్ణయించారు.
మరో వైపు బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తమ రాష్ట్రంలో 'ది కేరళ స్టోరీ' మూవీని పన్ను నుంచి మినహాయించారు.