బాల్యవివాహాన్ని ఆపడానికి ప్రయత్నించి రేప్‌కు గురైన మహిళతో ఇప్పటికీ మాట్లాడని పెళ్లికూతురు.. కారణం ఏంటి?
రాజస్థాన్‌లోని గ్రామీణ ప్రాంతంలో ఉండే బాల్యవివాహాలను అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది.
ఒక బాల్యవివాహాన్ని ఆపడానికి ప్రయత్నించిన మహిళ గ్యాంగ్ రేప్‌కు గురైంది. తనకు అన్యాయం జరగకూడదని జీవితాన్నే ఫణంగా పెట్టిన ఆ మహిళతో పెళ్లి కూతురు ఇప్పటికీ మాట్లాడటం లేదు. ఒక వైపు ప్రపంచమే ఆ లైంగిక దాడిపై భారత్‌ను ప్రశ్నిస్తే.. సదరు పెళ్లి కూతురు మాత్రం అకారణంగా ఆ మహిళపై కోపం పెంచుకున్నది. ఈ వివరాలన్నీ తెలియాలంటే 90వ దశకంలోని వెళ్లాలి..
భన్వరీదేవి.. రాజస్థాన్‌లోని కుమ్మరి కులానికి చెందిన ఒక సాధారణ మహిళ. తల్లిదండ్రులు బాల్య వివాహం చేయడంతో చిన్నప్పుడే భర్తతో జైపూర్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని భటేరీ గ్రామంలో కాపురం పెట్టింది. 1985లో రాజస్థాన్ ప్రభుత్వం విమెన్ డెవలెప్‌మెంట్ ప్రాజెక్ట్ కింద ఒక కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా భన్వేరీదేవిని ఆ గ్రామానికి 'సాథిన్' అంటే ఫ్రెండ్‌గా నియమించింది. ఆ గ్రామానికి చెందిన భూములు, నీళ్లు, అక్షరాస్యత, ఆరోగ్యం, ప్రజా పంపిణీ వ్యవస్థ, మహిళా కూలీలకు కనీస కూలీ ఇవ్వడం వంటి కార్యక్రమాల్లో భన్వరీదేవి సాథిన్‌గా పని చేసేది. ఒక మహిళా కార్యకర్తగా ఆ గ్రామంలో అందరికీ స్నేహితురాలిగా మారిపోయింది.
ఈ క్రమంలో రాజస్థాన్‌లోని గ్రామీణ ప్రాంతంలో ఉండే బాల్యవివాహాలను అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ముఖ్యంగా 'అఖా తీజ్' అనే రోజున మంచి ముహూర్తంగా భావించి చాలా మంది తమ పిల్లకు బాల్య వివాహాలు జరిపిస్తారు. టీనేజ్‌లో ఉండే పిల్లలకి ఈ పెళ్లిళ్లు జరిపిస్తారంటే ఏదో అనుకోవచ్చు. కానీ నెలలు నిండని పసి బిడ్డలకు కూడా ఆఖా తీజ్ రోజు పెళ్లిళ్లు చేయడం గమనార్హం. బలమైన కుల వ్యవస్థ ఉండే రాజస్థాన్‌లో బాల్యవివాహాలను అడ్డుకోవడం చాలా కష్టంగా ఉండేది. అందుకే ప్రభుత్వ యంత్రాంగం 'సాథిన్'ల సాయంతో ఈ వివాహాలను అడ్డుకోవాలని నిర్ణయించింది.
1992లో ఈ కార్యక్రమాన్ని రాజస్థాన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా బాల్యవివాహాలు జరుగకుండా చూడాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భన్వారీదేవికి ఒక తొమ్మిది నెలల ఆడశిశువును ఏడాది వయసున్న మగ శిశువుతో పెళ్లి జరిపిస్తున్నారనే సమాచారం అందింది. తనకు పాలు పోసే శాంతి అనే ఆమె ద్వారా భటేరీ గ్రామంలో ఒక బాల్య వివాహం జరుగుతోందని తెలుసుకున్నది. గుజార్ కులానికి చెందిన రామ్ కరణ గుజార్, శాంతీ దేవిల ఇద్దరు కుమార్తెలకు వివాహం చేస్తున్నారని.. అందులో ఒకరు నెలలు నిండని శిశువని తెలిసింది.
భన్వరీదేవి వెంటనే సదరు గుజర్ల ఇంటికి వెళ్లింది. మీ ఆడ శిశువుకు వివాహం జరిపించ వద్దని బతిమిలాడింది.పెళ్లి చేయడం వల్ల మీకు రూ.10 వేలు ఖర్చు అవుతుంది. ఆ సొమ్మును బ్యాంకులో ఆ చిన్నారి పేరు మీద డిపాజిట్ చేస్తే 18 ఏళ్లు నిండే సరికి పెళ్లి ఖర్చులకు పనికి వస్తాయని కూడా చెప్పింది. తమ కంటే తక్కువ అయిన కుమ్మరి కులానికి చెందిన భన్వరీదేవి వచ్చి అలా చెప్పేసరికి ఆ ఆడ శిశువు కుటుంబం కోపోద్రిక్తమైంది. ఇంకోసారి ఇంటికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ విషయాన్ని భన్వరీదేవికి చెప్పిన శాంతిని పాలు ఆమ్మడాన్ని బంద్ చేయించారు.
పట్టువిడవని భన్వరీదేవి ఆ పెళ్లి ఆపడానికి పై అధికారులను సంప్రదించింది. దీంతో వాళ్లు పోలీసులను పెళ్లి ఆపమని పంపించారు. అక్కడకు వెళ్లిన పోలీసులు పెళ్లి జరుగుతుంటే చోద్యం చూసి.. ఆ తర్వాత తీరిగ్గా పెళ్లి భోజనం చేసి తిరిగి వచ్చేశారు. పోలీసులతో పెళ్లిని ఆపడానికి ప్రయత్నించిందనే కోపంతో సదరు శిశువు కుటుంబం రగిలిపోయింది.
పెళ్లి జరిగిన ఐదు నెలల తర్వాత భన్వరీదేవిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించారు. ఒక రోజు భన్వరీదేవి ఆమె భర్త మోహన్ లాల్ ప్రజాపతి తమ పొలంలో పని చేసుకుంటున్నారు. పెళ్లికూతురు తరుపు బంధువులు ఐదుగురు వచ్చి మొదట మోహన్ లాల్ ప్రజాపతిని కర్రలతో కొట్టడం ప్రారంభించారు. భర్తను రక్షించడానికి వెళ్లిన భన్వరీదేవిని ముగ్గురు దారుణంగా రేప్ చేశారు. తమ ఆడపిల్ల పెళ్లినే అడ్డుకోవడానికి ప్రయత్నించిందంటూ భన్వరీదేవిని సామూహికంగా అత్యాచారం చేశారు. పోలీసులను తాను పంపలేదని.. కేవలం పై అధికారులకు మాత్రమే చెప్పానని వివరించినా.. వాళ్లు వదల్లేదు.
ప్రపంచాన్నే కదిలించిన లైంగిక దాడి ఘటన..
మహిళా హక్కుల కోసం పోరాడుతున్న ఫెమినిస్ట్‌గా, రేప్ బాధితురాలిగా భన్వరీదేవి పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోయింది. చాలా కాలం పాటు రేప్ బాధితురాలిగా జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో హెడ్ లైన్‌గా మారింది. దేశంలో మహిళా హక్కుల ఉద్యమంలో ఈ ఘటన ఒక బెంచ్ మార్క్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే భారత అత్యున్నత న్యాయస్థానం 1997లో 'విశాఖ గైడ్‌లైన్స్' రూపొందించింది. ఈ మార్గదర్శకాలే తర్వాత చట్టరూపం దాల్చింది. ఆ చట్టమే నేడు లక్షలాది మంది భారత మహిళలను పని స్థలంలో లైంగిక వేధింపుల నుంచి కాపాడుతున్నది.
ఒక బాల్య వివాహాన్ని ఆపి.. రేప్‌కు గురై.. ఇప్పుడు ఎంతో మంది మహిళలకు రక్షణ ఇస్తున్న చట్టానికి కారణమైన మహిళను మాత్రం.. సదరు పెళ్లి కూతురు ద్వేషిస్తోంది. పెళ్లినాటికి 9 నెలల వయసున్న ఆ పెళ్లి కూతురి వయస్సు ఇప్పుడు 32 ఏళ్లు. కానీ గత 32 ఏళ్లుగా భన్వరీదేవి బయట కనపడినా మొఖం చాటేస్తుంది తప్ప.. ఏనాడూ మాట్లాడలేదు. భన్వరీదేవి ఉంటున్న ఊరికి 40 కిలోమీటర్ల దూరంలోనే ఉంటున్న పెళ్లికూతురు 'బాయి దేవీ' ఇప్పటికీ ద్వేషించడం వెనుక కారణాన్ని చెప్పింది. మా తండ్రిని, బాబాయ్‌లను జైలుకు పంపించింది. అందుకే ఆమెను ప్రతీ రోజు తిట్టుకుంటానని చెప్పింది.
భన్వరీదేవి పోరటం తర్వాత ఇండియాలో బాల్య వివాహాల చట్టాలు కఠినంగా అమలవుతూ వచ్చాయి. అంతే కాకుండా మహిళలపై లైంగిక వేధింపులపై కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. అయితే మరోవైపు బాయి దేవి మాత్రం భన్వరీదేవిపై అనవసరమైన కోపాన్ని పెంచుకున్నది. తల్లిదండ్రులకు 9వ సంతానమైన బాయి దేవికి మొదట గల్లా అని పేరు పెట్టారు. దానికి ఆపెయ్/ఇక చాలు అని అర్థం. ఆ తర్వాత స్కూల్‌లో జాయిన్ చేసినప్పుడు మన్ భారీ (భారమైన హృదయం) అని పేరు పెట్టారు. తన 17వ ఏట, చిన్నప్పుడు తనకు పెళ్లైన భర్తతో కాపురం మొదలు పెట్టింది. అప్పటి నుంచి బాయి అని పేరుతో పిలుస్తున్నారు. ప్రస్తుతం ఆమె తనకు ఉన్న 40 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నది. ఆమె భర్త మార్కెట్లో తినుబండారాలు అమ్ముతూ ఉన్నాడు.
భన్వరీదేవి ఏం చేస్తోంది?
మహిళా హక్కుల కోసం, బాల్యవివాహాలను అరికట్టడం కోసం పోరాడి, తన జీవితాన్నే కోల్పోయిన భన్వరీదేవి ప్రస్తుతం భటేరీ గ్రామంలోనే శిథిలావస్థకు చేరుకున్న తన ఇంటిలో నివసిస్తోంది. కూలిపోయిన గోడలు, చెదలు పట్టిన కిటికీలు, వర్షం వస్తే కురిసే కప్పుతో ఉండే ఇంటిలో దీనావస్థలో ఉన్నది. తన భర్త చనిపోయిన తర్వాత ఒంటరిగా అదే ఇంటిలో ఉంటోంది. 80, 90 దశకాల్లో ఫెమినిజానికి మారు పేరుగా నిలిచిన భన్వరీదేవి.. ప్రస్తుతం మౌనంగా జీవితాన్ని వెళ్లదీస్తోంది. ఒకప్పుడు హక్కుల కోసం పోరాడిన మహిళ అయిన భన్వరీదేవి డబ్బు కోసం కొడుకు, కూతుర్లు కొట్లాడుకుంటుండటం ఆమెను మరింతగా వేధిస్తోంది.
నా భర్త దూరం కావడంతో నేను ఒంటరిని అయ్యాను. ఇప్పుడు చిన్న చిన్న పనులు చేయడానికి కూడా నాకు సాయం ఎవరూ లేరని బాధగా చెబుతోంది. ఒక వైపు సొంత బిడ్డలు ఆస్తుల కోసం గొడవలు పడుతుండటం.. మరోవైపు తాను రక్షించాలని ప్రయత్నించిన వాళ్లు అకారణంగా ద్వేషిస్తుండటంతో భన్వరీదేవి పూర్తిగా కృంగి పోయింది. అయినా సరే తన కారణంగా దేశంలోని మహిళలకు రక్షణ చట్టాలు వచ్చాయని ఇప్పటికీ పొంగిపోతోంది.