ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన టీసీఎస్
ఇటీవల కాలంలో ప్రతిభావంతులైన వారు కూడా ఉద్యోగాలు కోల్పోయారని.. అలా ఉద్యోగాలు కోల్పోయిన ప్రతిభావంతులైన స్టార్టప్ ఉద్యోగులను తాము నియమించుకోవాలని భావిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
ప్రపంచ వ్యాప్తంగా ఐటీ ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఎప్పుడు తమ తొలగింపు మెయిల్ వస్తుందో అన్న భయం చాలా మందిలో ఉంది. గూగుల్, మైక్రోసాప్ట్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలతో పాటు చిన్నచిన్న కంపెనీలు కూడా భారీగా ఉద్యోగులను ఇంటిదారి పట్టిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత ఐటీ దిగ్గజ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)మాత్రం భిన్నంగా స్పందించింది.
తమ కంపెనీలో లేఆఫ్‌లు ఉండవని కంపెనీ చీఫ్ హ్యుమన్ రీసెర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఒక ఉద్యోగిని తమ కంపెనీలోకి తీసుకున్న తర్వాత అతడితో సుదీర్ఘ ప్రయాణం చేయాలని తమ కంపెనీ భావిస్తుందన్నారు. టీసీఎస్ ఒక్కసారి ఉద్యోగులను నియమించుకుంటే తొలగింపునకు ఆసక్తి చూపదన్నారు. ఒకవేళ ఉద్యోగి నుంచి ఆశించిన ఫలితం రాకపోతే సరైన శిక్షణ ఇచ్చి పనిచేయించుకుంటామని వివరించారు.
ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండటంపై స్పందించిన లక్కడ్.. చాలా కంపెనీలు అవసరానికి మించి ఉద్యోగులను నియమించుకుంటాయని.. దాని వల్లే ఇలా లేఆఫ్‌లు ప్రకటించాల్సిన పరిస్థితులు వస్తాయన్నారు. ఇటీవల కాలంలో ప్రతిభావంతులైన వారు కూడా ఉద్యోగాలు కోల్పోయారని.. అలా ఉద్యోగాలు కోల్పోయిన ప్రతిభావంతులైన స్టార్టప్ ఉద్యోగులను తాము నియమించుకోవాలని భావిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. టీసీఎస్ ఉద్యోగులకు జీతాల పెంపు కూడా ఉంటుందని పరోక్షంగా సంకేతాలిచ్చారు.