గర్భస్రావంపై తీర్పు ఇచ్చిన 24 గంటల్లోనే మాట మార్చిన సుప్రీంకోర్టు.. ఎందుకంటే ..
శిశువు జీవించేందుకు అవకాశాలు ఉండడంతో సుప్రీంకోర్టు తన ఆదేశాలను సమీక్షించింది. గర్బస్రావాన్ని వాయిదా వేయాలని ఎయిమ్స్ ను ఆదేశించింది.
మహిళ గర్భస్రావం అభ్యర్థనపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 26 వారాలు అంటే ఏడు నెలల గర్భాన్ని తొలగించేందుకు ఎయిమ్స్ కు ఆదేశాలు ఇచ్చిన మరుసటి రోజే, ఆ ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపివేసింది. గర్బస్రావాన్ని వాయిదా వేయాలని ఎయిమ్స్ ను ఆదేశించింది. శిశువు జీవించేందుకు అవకాశాలు ఉండడంతో సుప్రీంకోర్టు తన ఆదేశాలను సమీక్షించింది.
తన 26 వారాల గర్భాన్ని అబార్షన్ చేసుకోవడానికి అనుమతించాలని ఒక వివాహిత కోర్టును ఆశ్రయించింది. తనకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారని, మానసిక స్థితి కూడా సరిగా లేదని చెబుతూ వైద్య పరంగా గర్భవిచ్ఛిత్తికి అనుమతించాలని కోరింది. సాధారణంగా అత్యాచార బాధితురాళ్లు, మైనర్లు అవాంఛిత గర్భానికి లోనైతే 24 వారాల వరకు గర్భస్రావానికి అనుమతిస్తారు. దీన్నే మెడికల్ టెర్మినేషన్‌గా చెబుతారు. ఇతర మహిళలకు అరుదైన కేసుల్లో మాత్రమే అబార్షన్‌కు అనుమతి ఉంటుంది. అయితే మహిళ అభ్యర్థన మేరకు మొదట ఈ కేసును విచారించిన జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ నాగరత్న ధర్మాసనం అబార్షన్‌కు అనుమతి ఇచ్చింది. శిశువుకు జన్మనివ్వాలా? వద్దా? అన్నది మహిళ హక్కు అని, బిడ్డ పోషణ తనకు సాధ్యం కాదని ఆ మహిళ భావించినప్పుడు అబార్షన్‌కు వెళ్లే హక్కు ఆమెకు ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒక మహిళ శరీరంపై ఆ మహిళకే సర్వ హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. అయితే మెడికల్ బోర్డ్ మాత్రం శిశువు సంపూర్ణంగా ఆరోగ్యంతో జన్మిస్తుందని, అబార్షన్ చేస్తే అది శిశు హత్యతో సమానమవుతుందన్న సూచనలను ధర్మాసనం పట్టించుకోలేదు.
అయితే ఇప్పుడు గర్భస్రావానికి ఆదేశిస్తూ జారీ చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలంటూ అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి సుప్రీంకోర్టును కోరారు. మెడికల్ బోర్డ్ సదరు మహిళ గర్భం నిలబడటానికి, ప్రసవించేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పినప్పటికీ, కోర్టు గర్భస్రావానికి అనుకూలంగా ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని కోర్టుకు విన్నవించారు. దీంతో చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ తీర్పును వెనక్కి తీసుకోవాలని కోరుతూ అప్లికేషన్‌ను అధికారికంగా సమర్పించాలని కోరింది. అబార్షన్‌కు అనుకూలంగా ఆదేశాలిచ్చిన బెంచ్ ముందు ఉంచుతామని పేర్కొంది. వైద్యులు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని గందరగోళంలో ఉన్నందున ప్రస్తుతానికి అబార్షన్‌ను వాయిదా వేయాలని సూచించింది.
♦