క్షమాపణలు యాడ్‌ సైజ్‌లోనే ప్రచురించారా? - ‘పతంజలి’ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

క్షమాపణలు చెబుతూ పెద్ద పరిమాణంలో మరోసారి అదనపు ప్రకటనలు ప్రచురిస్తామని రోహత్గీ కోర్టుకు తెలిపారు. దీంతో విచారణను ధర్మాసనం ఏప్రిల్‌ 30కి వాయిదా వేసింది.

Advertisement
Update:2024-04-23 19:34 IST

పతంజలి ఆయుర్వేద సంస్థపై సుప్రీంకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. ఆధునిక వైద్యవిధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ యోగా గురువు రామ్‌దేవ్ బాబాకు చెందిన పతంజలిపై ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. మంగళవారం దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం పతంజలి సమాధానంపై మరోసారి అసహనం వ్యక్తం చేసింది.

మంగళవారం చేపట్టిన విచారణ సందర్భంగా.. తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో బహిరంగ క్షమాపణలు చెబుతూ దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని పతంజలి సంస్థ సుప్రీంకోర్టులో వెల్లడించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం స్పందిస్తూ.. ఉత్పత్తులకు సంబంధించి ఇచ్చే ప్రకటనల సైజులోనే క్షమాపణల ప్రకటన ఇచ్చారా? అని ప్రశ్నించింది. పతంజలి తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ముకుల్‌ రోహత్గీ న్యాయస్థానం ముందు మాట్లాడుతూ.. 67 పత్రికల్లో రూ.10 లక్షలు వెచ్చించి ప్రకటనలు ఇచ్చినట్టు తెలిపారు. దీనిపై జస్టిస్‌ హిమా కోహ్లి స్పందిస్తూ.. క్షమాపణలను ప్రముఖంగా ప్రచురించారా? గతంలో ఉత్పత్తుల యాడ్లలో ఉపయోగించిన ఫాంట్‌నే వాడారా? అదే సైజులో క్షమాపణలను పబ్లిష్‌ చేశారా? అని ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో క్షమాపణలు చెబుతూ పెద్ద పరిమాణంలో మరోసారి అదనపు ప్రకటనలు ప్రచురిస్తామని రోహత్గీ కోర్టుకు తెలిపారు. దీంతో విచారణను ధర్మాసనం ఏప్రిల్‌ 30కి వాయిదా వేసింది. కోర్టు ధిక్కార అంశాన్ని సైతం అప్పుడే విచారిస్తామని పేర్కొంది. పత్రికల్లో వచ్చిన క్షమాపణల ప్రకటనలను రెండు రోజుల్లోగా సమర్పించాలని కోర్టు ఆదేశించింది. గత విచారణ సందర్భంగా కోర్టుకు రామ్‌దేవ్‌బాబా, సంస్థ మేనేజర్‌ బాలకృష్ణ బేషరతుగా క్షమాపణలు చెప్పినా కోర్టు వాటిని అంగీకరించలేదు. శిక్షకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది.

Tags:    
Advertisement

Similar News