ఖైదీల విషయంలో ఆ పరిమితి సమర్థనీయమే.. - సుప్రీంకోర్టు
జైలులో ఉన్న విచారణ ఖైదీలు, ఇతర ఖైదీలను వారానికి రెండు సార్లు మాత్రమే కలుసుకునేలా వారి బంధువులు, మిత్రులు, లాయర్ల సందర్శనలపై ఢిల్లీ ప్రభుత్వం పరిమితి విధించింది.
ఖైదీల విషయంలో ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా సమర్థించింది. అసలు విషయమేంటంటే.. జైలులో ఉన్న విచారణ ఖైదీలు, ఇతర ఖైదీలను వారానికి రెండు సార్లు మాత్రమే కలుసుకునేలా వారి బంధువులు, మిత్రులు, లాయర్ల సందర్శనలపై ఢిల్లీ ప్రభుత్వం పరిమితి విధించింది. ఢిల్లీ జైళ్ల నిబంధనలు–2018ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు గత ఏడాది ఫిబ్రవరిలో తీర్పు వెలువరించింది. జైళ్లలోని ఖైదీల సంఖ్య, వసతులు, సిబ్బంది అందుబాటు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని న్యాయస్థానం పేర్కొంది.
ఈ నేపథ్యంలో పిటిషన్‌దారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పు సందర్భంగా వెల్లడించిన అభిప్రాయంతో తాము ఏకీభవిస్తున్నట్టు తెలిపింది. ఢిల్లీలో మొత్తం 16 జైళ్లు ఉండగా, వాటిలో 10,026 మంది ఖైదీలను మాత్రమే ఉంచే సామర్థ్యం ఉందని ఢిల్లీ ప్రభుత్వం ధర్మాసనానికి తెలిపింది. అయితే.. ప్రస్తుతం 18 వేల మందికి పైగా ఆయా జైళ్లలో ఉన్నారని వివరించింది. ఇటువంటి పరిస్థితుల్లో వారానికి రెండు దఫాలకు మించి బంధువులు, న్యాయవాదులను కలుసుకునేందుకు ఖైదీలను అనుమతించలేమని తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ న్యాయస్థానాలు కూడా దీనిపై నమోదైన పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు చెప్పాయి.