ఆన్సర్ షీట్ చూపించలేదని విద్యార్థిపై కత్తితో దాడి..
ప్రస్తుతం ప్రాణాపాయం లేకపోవడంతో విద్యార్థి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన ముగ్గురు విద్యార్థులపై ఐపీసీ సెక్షన్ 324 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.
మహారాష్ట్రలోని భివండిలో దారుణం చోటు చేసుకుంది. పదో తరగతి పరీక్షల్లో జవాబులు చూపించలేదని తోటి విద్యార్థిపై కత్తితో దాడిచేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో భాగంగా భీవండిలోని ఓ స్కూల్‌లో విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని ఆన్సర్ షీట్ చూపించాలని తోటి విద్యార్థులు అడిగారు. అందుకు అతడు తిరస్కరించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన ముగ్గురు స్టూడెంట్స్.. ఆ విద్యార్థి పరీక్షా కేంద్రం నుంచి బయటకు రాగానే కత్తితో దాడిచేశారు. మంగళవారం పరీక్ష ముగిసిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. గాయపడిన విద్యార్థిని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రాణాపాయం లేకపోవడంతో విద్యార్థి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన ముగ్గురు విద్యార్థులపై ఐపీసీ సెక్షన్ 324 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.
సరిగ్గా నాలుగు రోజుల క్రితం కడప జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. తమకు జవాబులు చూపించలేదు అన్న కోపంతో ఒక విద్యార్థి పరీక్ష ముగిసిన తరువాత మరో విద్యార్థితో వాగ్వివాదానికి దిగాడు. విషయాన్ని బయటకు వచ్చి తన బంధువులకు తెలుపడంతో అందరూ కలిసి విద్యార్థిని అడ్డుకుని జవాబులను ఎందుకు చూపించలేదని చుట్టుముట్టి దాడిచేయడానికి ప్రయత్నించారు. ఇది గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని దాడికి ప్రయత్నించిన వారిని గట్టిగా మందలించడంతో అక్కడినుంచి వెళ్లిపోయారు.