పీఎం కేర్స్ ట్రస్టీగా రతన్ టాటా

పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టీగా రతన్ టాటాతో పాటు జస్టిస్ కేటీ థామస్, లోక్‌సభ మాజీ డిప్యూటీ స్పీక‌ర్‌ కరియా ముండాను నియమించారు. ఇకపై పీఎం కేర్స్ ఫండ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలుగా వీళ్లు వ్యవహరించనున్నారు.

Advertisement
Update:2022-09-21 17:29 IST

కోవిడ్ క‌ల్లోల‌ సమయంలో అవసరమైన నిధులు సమకూర్చడానికి ప్రధాని మోడీ.. పీఎం కేర్స్ (ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్) ఫండ్‌ను ప్రారంభించారు. అప్పటికప్పుడు ఏర్పాటు చేసినా భారీ మొత్తంలో విరాళాలు ఇవ్వడంపై అప్పట్లో ప్రధాని మోడీ ప్రజలను కొనియాడారు. ఇప్పటి వరకు పీఎం కేర్స్ ఫండ్ సభ్యులుగా ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు ఉన్నారు. తాజాగా మరో ముగ్గురిని ట్రస్టీలుగా పీఎం కేర్స్ ఫండ్ బోర్డులోకి తీసుకున్నారు. మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వీరి నియామకం జరిగింది. పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టీగా రతన్ టాటాతో పాటు జస్టిస్ కేటీ థామస్, లోక్‌సభ మాజీ డిప్యూటీ స్పీక‌ర్‌ కరియా ముండాను నియమించారు. ఇకపై పీఎం కేర్స్ ఫండ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలుగా వీళ్లు వ్యవహరించనున్నారు.

కొవిడ్‌ పాండమిక్ సమయంలో 2020లో ఈ పీఎం కేర్స్ ఫండ్ మొదలైంది. 2020-21 ఫైనాన్షియల్ ఇయర్‌లో పీఎం కేర్స్‌కు రూ.10,990 కోట్ల విరాళాలు అందాయి. ఇందులో పలు కార్యక్రమాల ద్వారా రూ. 3,976 కోట్లను లబ్దిదారులకు పంచిపెట్టారు. పీఎం కేర్స్ చిల్ట్రన్స్ స్కీమ్ ద్వారా 4,345 మంది చిన్నారులకు సహాయం చేసినట్లు పీఎంవో నివేదికలో తెలిపింది. పీఎం కేర్స్ కేవలం కరోనా సమయంలోనే కాకుండా భవిష్యత్‌లో మరింత ముఖ్యమైన పాత్ర పోషించనున్నట్లు మోడీ తెలిపారు. అత్యవసర, ప్రతికూల పరిస్థితుల్లోనే కాకుండా అవసరమైన వారికి సహాయం చేయడానికి ఈ నిధులు ఉపయోగిస్తామని అన్నారు. పీఎం కేర్స్ బోర్డులోకి ట్రస్టీలుగా చేరడానికి అంగీకరించిన ముగ్గురిని ఆయన స్వాగతించారు.

కాగా, పీఎం కేర్ అడ్వైజరీ బోర్డులోకి మాజీ కాగ్ రాజీవ్ మ‌హ‌ర్షి, ఇన్ఫోసిస్ మాజీ చైర్‌పర్సన్ సుధా మూర్తి, టెక్ ఫర్ ఇండియా కో-ఫౌండర్ ఆనంద్ షాలను నియమించారు. కొత్త ట్రస్టీలు, సలహాదారుల చేరికతో పీఎం కేర్స్ మరింత పారదర్శకంగా పని చేసే వీలుంటుందని అన్నారు. ప్రజలకు అవసరమైన పలు సందర్భాల్లో పీఎం కేర్స్ నిధులు ఉపయోగించుకుంటామని అన్నారు. పీఎం కేర్స్ ప్రకటన రాగానే దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, సెలెబ్రిటీలు, సామాన్యులు తనకు చేతనైనంత సాయం చేశారు. ప్రస్తుతం వేల కోట్ల రూపాయలు పీఎం కేర్స్ ఖాతాల్లో ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News