రైల్వే బీమా గురించి మీకు తెలుసా..? - రూపాయి క‌న్నా త‌క్కువ ప్రీమియంతో రూ.10 ల‌క్ష‌ల బీమా

ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకునేవారికి ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని భారతీయ రైల్వేశాఖ అందిస్తోంది. ఈ విషయం తెలియక చాలామంది ప్రయాణికులు తీవ్రంగా నష్టపోతున్నారు.

Advertisement
Update:2023-06-04 14:54 IST

కోర‌మండ‌ల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్ర‌మాదం నేప‌థ్యంలో భార‌తీయ‌ రైల్వే శాఖ అందిస్తున్న బీమా స‌దుపాయం అంశం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఒడిశాలో తాజాగా జ‌రిగిన కోర‌మండ‌ల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్ర‌మాదంలో 288 మంది మృతిచెంద‌గా, 1175 మంది గాయ‌ప‌డిన విష‌యం తెలిసిందే.

భారతీయ రైల్వేశాఖ ప్రతి రైలు ప్రయాణికుడికీ రూ.10 లక్షల వరకు బీమా సదుపాయం కల్పిస్తోంది. రైలు ప్రమాదంలో మరణించినా.. లేదా శాశ్వతంగా అంగవైకల్యం ఏర్పడి మరే పని చేయలేని పరిస్థితి ఎదురైనా.. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు అందిస్తుంది. తీవ్రంగా గాయపడి అంగ వైకల్యం ఏర్పడినప్పుడు రూ.7.5 లక్షల వరకు బీమా సొమ్ము అందుతుంది. క్షతగాత్రులకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.2 లక్షల వరకు అందిస్తారు.

రూపాయి కన్నా తక్కువ రుసుంతోనే..

రూపాయి కన్నా తక్కువ రుసుంతోనే ఇండియన్ రైల్వేస్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఈ సదుపాయాలు కల్పిస్తుండటం విశేషం. ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకునేవారికి ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని భారతీయ రైల్వేశాఖ అందిస్తోంది. ఈ విషయం తెలియక చాలామంది ప్రయాణికులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రమాదానికి గురైనప్పటికీ ఎలాంటి పరిహారం పొందలేకపోతున్నారు.

టికెట్ బుక్ చేసేట‌ప్పుడే..

ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు వెబ్‌సైట్‌లో ట్రావెల్ ఇన్సూరెన్స్ చేసుకోవ‌డానికి ఒక 'బాక్సు' వస్తుంది. అందులో టిక్కు పెడితే.. బీమా కోసం రూపాయి కన్నా తక్కువ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించిన వెంటనే మీ ఫోనుకు, ఈ-మెయిల్‌కి ఒక లింకు వస్తుంది. అది బీమా కంపెనీకి సంబంధించిన లింక్. ఆ లింకు తెరిచి, నామినీ వివరాలు కచ్చితంగా పొందుపరచాల్సి ఉంటుంది. నామినీ వివరాలు అందించకపోతే, బీమా దరఖాస్తుకు వీలుపడదు.

Tags:    
Advertisement

Similar News