రాజస్థాన్‌లో ప్రారంభమైన పోలింగ్..!

ఎన్నికలు శాంతియుత వాతావరణలో జరిగేలా చూసేందుకు లక్షా 70 వేల మంది భద్రతా సిబ్బంది రాజస్థాన్‌లో మొహరించారు. ఎన్నికల విధుల కోసం 700 కంపెనీల బలగాలను రంగంలోకి దించారు.

Advertisement
Update:2023-11-25 08:06 IST

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఇవాళ రాజస్థాన్‌లోని 199 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. రాజస్థాన్‌లో దాదాపు 5 కోట్ల 26 లక్షల మంది ఓటర్లు గెహ్లాట్ సర్కార్ భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.

రాజస్థాన్ వ్యాప్తంగా 51 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది ఈసీ. పట్టణ ప్రాంతాల్లో 10,501, గ్రామీణ ప్రాంతాల్లో 41 వేల 6 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు స్పష్టంచేసింది. 26 వేలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్‌ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగేలా చూసేందుకు 6 వేల 287 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు అధికారులు వెల్లడించారు. సుమారు 2 లక్షల 74 వేల మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.

ఎన్నికలు శాంతియుత వాతావరణలో జరిగేలా చూసేందుకు లక్షా 70 వేల మంది భద్రతా సిబ్బంది రాజస్థాన్‌లో మొహరించారు. ఎన్నికల విధుల కోసం 700 కంపెనీల బలగాలను రంగంలోకి దించారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. రాజస్థాన్‌లో 200 అసెంబ్లీ స్థానాలుండగా కరణ్‌పూర్‌ స్థానంలో అభ్యర్థి గుర్మిత్ సింగ్ చనిపోయారు. దీంతో 199 స్థానాలకే పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌, బీజేపీ నువ్వా-నేనా అన్నట్లుగా హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్‌, మిజోరాం, ఛ‌త్తీస్‌గఢ్‌లో పోలింగ్ ముగిసింది. ఛ‌త్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించారు. ఇక తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌ 30న పోలింగ్ జరగనుంది.

Tags:    
Advertisement

Similar News