చైనాపై పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు.. కాంగ్రెస్ వివరణ
ఆయన మాటలు కాంగ్రెస్ వైఖరి ప్రతిబింబించడం లేదన్న జైరాం రమేశ్
తమ పార్టీ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తాజాగా స్పందించింది. చైనా విషయంలో పిట్రోడా వ్యక్తం చేసింది పార్టీ అభిప్రాయం కాదు. ఆయన మాటలు కాంగ్రెస్ వైఖరి ప్రతిబింబించడం లేదు. విదేశాంగ విధానం, భద్రత, ఆర్థికపరంగా చైనా ఇప్పటికీ సవాల్‌గా ఉన్నది అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ వివరణ ఇచ్చుకున్నారు.
తరుచూ సొంతపార్టీని ఇబ్బందుల్లో పెట్టేలా శామ్ పిట్రోడా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. ఈసారి చైనా గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. చైనా పట్ల మన దేశ వైఖరి మొదటిరోజు నుంచి ఘర్షణాత్మకంగా ఉంది. మనం అవలంబిస్తున్న ఈ విధానం దేశానికి కొత్త శత్రువులను సృష్టిస్తున్నది. భారత్‌కు సరైన మద్దతు దక్కట్లేదు. ఇప్పటికైనా భారత్ తన వైఖరిని మార్చుకోవాలి. ఇది కేవలం చైనా విషయంలోనే కాదు. ఇతర దేశాలకు కూడా వర్తిస్తుంది. అయినా చైనా నుంచి ఏమి ముప్పుందో నాకు అర్థం కావట్లేదు. అమెరికా చైనాను తరుచూ శత్రువుగా పేర్కొంటూ.. భారత్‌కు కూడా అదే అలవాటు చేస్తున్నదని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో భారత్-చైనా మధ్య వాస్తవాధీన రేఖ వద్ద జరుగుతున్న ఘర్షణల నివారణకు సాయం చేస్తానంటూ ట్రంప్ ఆఫర్ ఇచ్చారు. కాగా దీనిపై భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రి స్పందిస్తూ... సున్నితంగా తిరస్కరించారు. పొరుగుదేశాలతో ఉన్న సమస్యలపై భారత్ ఎప్పుడూ ద్వైపాక్షిక చర్చలనే మార్గంగా ఎంచుకొంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పిట్రోడా స్పందన వచ్చింది. ఇది గాల్వన్ అమరవీరులను అవమానించడం కాదా? అంటూ బీజేపీ మండిపడింది.