రాజ‌కీయ ప్ర‌త్య‌ర్దులే లక్ష్యంగా ఈడిని వినియోగిస్తున్న ప్రభుత్వం.. ఎనిమిదేళ్ళ‌లో ఆరు రెట్లు పెరిగిన దాడులు

గతంలో దేశంలో ప్రతి ఒక్కరూ సిబీఐ దాడుల గురి‍ంచే వినేవాళ్ళు, కానీ ఇప్పుడు ఈడీ గురించే ఎక్కువగా వినపడుతోంది. ఈ ఎనిమిదేళ్ళలో ఈడీ దాడులు ఆరు రెట్లు పెరిగాయని డేటా చెప్తోంది.

Advertisement
Update:2022-08-23 14:41 IST

గాంధీ కుటుంబంతో పాటు విప‌క్ష నాయ‌కుల హైప్రొఫైల్ కేసుల‌కు సంబంధించి ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడి) ఇటీవ‌ల కాలంలో త‌ర‌చూ ప‌తాక శీర్షిక‌ల్లో క‌నిపిస్తోంది. జులై చివరి వారంలో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అధికారాలకు సంబంధించి, మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ ఎ), 2002 యొక్క రాజ్యాంగబద్ధతను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ చ‌ట్టం

విష‌యంలో ఈడి అధికారాల‌కు సంబంధించి దాఖ‌లైన దాదాపు 200 పిటిష‌న్ల‌ను కొట్టివేస్తూ ఈడీకి విస్తృత ప‌రిశోధ‌న అధికారాలు ఉన్నాయ‌ని పేర్కొంది. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధుల‌ను వేధించేందుకు, బెదిరించేందుకు న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం ఈడీ, సిబిఐ వంటి ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను ప్ర‌యోగిస్తోంద‌నే విమ‌ర్శ‌ల నేపథ్యంలో సుప్రీం కోర్టు ఈ తీర్పు వెలువ‌రించింది.

ఒక‌ప్పుడు ద‌ర్యాప్తు సంస్థ‌ల‌లో ప్ర‌ముఖంగా ఉన్న సిబిఐ నేడు ఈడి తో పోల్చుకుంటే వెన‌క‌బ‌డింది. గత ఎనిమిదేళ్లలో హైప్రొఫైల్ వ్య‌క్తుల‌పై కేసుల న‌మోదు చేయ‌డం, ఇళ్ళ‌పై దాడులు చేయ‌డంలో ఈడి ప‌రిశోధ‌న‌లు, విచార‌ణ‌లు ఆరు రెట్లు పెరిగాయని, దీంతో ఇప్పుడు సీబీఐని ఆ సంస్థ అధిగమించిందని ఒక‌ విశ్లేషణ వెల్లడించింది.

2004 -2014 మధ్య, కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఈడి కేవలం 112 దాడులు చేసింది. కానీ 2014- 2022 మధ్య, బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్ర‌భుత్వంలో దాదాపు 3,000 కంటే ఎక్కువ సార్లు దాడులు జరిగాయి. గత దశాబ్ద కాలంలో విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కింద 24,893 కేసులు, మనీలాండరింగ్ కింద‌ 3,985 కేసులు నమోదు చేసింది.

2014-15లో ఫెమా కింద 915 కేసులు నమోదయ్యాయి. 2018-19లో 2,659 కేసులు నమోదయ్యాయి. 2021-22లో ఈ సంఖ్య 5,313కి పెరిగింది. 2014-15లో పీఎంఎల్‌ఏ కింద 178 కేసులు నమోదు కాగా, 2021-22 నాటికి 1,180కి పెరిగింది. మొత్తం మీద 2014-15లో 1,093 కేసులు నమోదైతే, 2021-22 నాటికి ఆ సంఖ్య 5,493కి పెరిగింది.

గత ఐదేళ్లలో 3,000 మందికి పైగా సివిల్ స‌ర్వెంట్ల పై 2,300 కేసులు నమోదు చేసిన సీబీఐ 2017లో 632 కేసులు, 2018లో 460, 2019లో 396, 2020లో 425, 2021లో 457 కేసులు నమోదు చేసింది. ఎక్సైజ్ స్కామ్ ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, రాష్ట్ర సివిల్ సర్వెంట్లపై గత వారం జరిగిన దాడులు ఈ సంస్థ ఇటీవలి సంవత్సరాలలో విచారించిన అత్యంత ముఖ్యమైన కేసు.

ఫారిన్ ఎక్స్ఛేంజ్ రెగ్యులేషన్ యాక్ట్- 1947 ప్ర‌కారం ఫెమా ఉల్లంఘ‌న‌ల‌ను నియంత్రించేందుకు 1956 మే 1న ఎన్ ఫోర్స్‌మెంట్ యూనిట్ ఏర్ప‌డింది. 1957లో, ఈ యూనిట్ పేరు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌గా మార్చారు. 2002లో, ఎన్డీయే ప్రభుత్వం పిఎంఎల్ఎ అమలులోకి తెచ్చింది.2005, 2009, 2012లో యుపిఎ ప్రభుత్వం ఈ చట్టాన్ని సవరించింది.

2012 సవరణలో డబ్బును అక్ర‌మంగా సంపాదించ‌డం,దాచిపెట్టడం, నేరాల కోసం డ‌బ్బును ఉప‌యోగించ‌డం వంటి వాటిని కూడా ఈ నేరాల జాబితాలో చేర్చింది. ఈ చట్టంలోని షెడ్యూల్‌ పార్ట్-ఎ లో చేర్చిన అవినీతి నిరోధక చట్టం, రాజకీయ స్కామ్‌లపై చర్య తీసుకునేందుకు ఈడీకి అధికారం క‌ల్పించింది.

డిఎస్ పిఈ చ‌ట్టం ఏం చెబుతోంది...

ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డిఎస్ పిఈ) చట్టం-1946 ప్ర‌కారం సిబిఐ ప‌ని చేస్తుంది. ఆ రాష్ట్రంలో నేరాన్ని విచారించే ముందు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ సమ్మతిని తప్పనిసరిగా తీసుకోవాలి.

ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లోని ఏ సభ్యుడు అయినా, ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా, కేంద్రపాలిత ప్రాంతం, రైల్వే ప్రాంతం కాకుండా, రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా అధికారాలు అమలు చేయడానికి వీలుండ‌దు."

సాంప్రదాయకంగా, దాదాపు అన్ని రాష్ట్రాలు సీబీఐ ప్ర‌వేశానికి అనుమ‌తిని ఇచ్చాయి. అయితే, 2015 నుండి, తొమ్మిది రాష్ట్రాలు- మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, కేరళ, మేఘాలయ,మిజోరం రాష్ట్రాలు ఈ సమ్మతిని ఉపసంహరించుకున్నాయి.

సమ్మతి ఉపసంహరణ సమయంలో చివరి రెండు రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాలు ప్రతిపక్ష పార్టీల యేలుబ‌డిలో ఉన్నాయి. మహారాష్ట్రలో, శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం సీబీఐ కి అనుమతిని పునరుద్ధరించింది. విపక్షాల పాలిత రాష్ట్రాల్లో సీబీఐ ప్రవేశంపై అనుమ‌తి లేక‌పోవ‌డంతో కేంద్రం ఈడీపై ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది.

గత మూడేళ్లలో, డైరెక్టరేట్ పరిధి పెరిగింది. ఇందులో ఎక్కువ మంది అధికారులు నియ‌మితుల‌వ‌డ‌మేకాక భారీగా బడ్జెట్‌లను కూడా పెంచారు. న్యూఢిల్లీలోని ఎపిజె అబ్దుల్ కలాం రోడ్‌లో కొత్తగా నిర్మించిన ప్రవర్తన్ భవన్‌లో చాలా మంది డొమైన్ నిపుణులు డేటా, ఫైల్‌లను డీకోడింగ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈడి కి అంతర్జాతీయ ఫైనాన్స్, టాక్సేష‌న్ విష‌యాల‌లో అనుభ‌వ‌జ్ఞుడైన ఐఆర్ ఎస్ అధికారి సంజ‌య్ కుమార్ మిశ్రా నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News