అది ఆర్ట్.. ఆయన ఆర్టిస్ట్..
డ్రస్సులు మార్చడం అనేది ఆర్ట్ అయితే, అందులో మోదీ ఓ ఛాంపియన్ అంటూ.. ఆయన డ్రస్సులు మార్చేసిన ఫొటోలను ఒకరు ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ప్రధాని నరేంద్రమోదీ కర్నాటకలోని బందీపుర టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయన ఖాకీ ఫ్యాంట్, ఆర్మీ టీషర్ట్, దానిపై స్లీవ్ లెస్ జాకెట్ ధరించి, దానికి మ్యాచింగ్ టోపీ పెట్టుకుని బైనాక్యులర్ తో హడావిడి చేశారు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ గా మారాయి.
ఆ తర్వాత తమిళనాడులోని తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్ కి వెళ్లిన మోదీ.. ఆస్కార్ గెలుచుకున్న 'ద ఎలిఫెంట్ విష్పర్స్' డాక్యుమెంటరీలో కనిపించిన బొమ్మన్, బెల్లీతో ఫొటోలు దిగారు. అయితే ఆ ఫొటోల్లో మోదీ రెండు డ్రస్సుల్లో కనిపిస్తారు. తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్ లోనే ఆయన డ్రస్ ఛేంజ్ చేసుకున్నారు. అలా రెండు డ్రస్సుల్లో బొమ్మన్, బెల్లీతో కలసి మోదీ దిగిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఆ ఫొటోలపై నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు.
డ్రస్సులు మార్చడం అనేది ఆర్ట్ అయితే, అందులో మోదీ ఓ ఛాంపియన్ అంటూ.. ఆయన డ్రస్సులు మార్చేసిన ఫొటోలను ఒకరు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీన్ని రీట్వీట్ చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సెటైర్ పేల్చారు. ఆయనకు అది కేవలం ఆర్ట్ మాత్రమే కాదని, మోదీకి సంబంధించి అది పొలిటికల్ సైన్స్ అని అన్నారు.
ఇక మోదీ, బందీపుర టూర్ గురించి కూడా జైరాం రమేష్ సెటైర్లు పేల్చారు. ప్రాజెక్ట్ టైగర్ 50 ఏళ్ల ప్రస్ధానంలో మోదీ హెడ్ లైన్స్ కి ఎక్కినా.. వాస్తవం మాత్రం పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. బందీపురలో 50 ఏళ్ల క్రితం ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభమైతే దాన్ని తన ఖాతాలో వేసుకోవడం మోదీకే చెల్లిందన్నారు జైరాం రమేష్. పర్యావరణ పరిరక్షణ, అడవులు, వన్యప్రాణులు, గిరిజనుల హక్కుల కోసం తీసుకువచ్చిన చట్టాలను బీజేపీ నేతలు యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు.