మధ్యప్రదేశ్ కి ఎన్నికల తాయిలాలు.. ఒకేరోజు రెండు వందే భారత్ రైళ్లు
ఒకేరోజు రెండు వందే భారత్ రైళ్లను మధ్యప్రదేశ్ కి అంకితమిచ్చి ఎన్నికల ఏడాదిలో తాయిలాల పరంపర కొనసాగించారు మోదీ.
ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలున్నాయంటే ఆ రాష్ట్రం చుట్టూ చక్కర్లు కొడుతుంటుంది మోదీ అండ్ టీమ్. విదేశీ పర్యటన అనంతరం మోదీ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఎన్నికల ఏడాదిలో ఆ రాష్ట్రానికి రెండు వందే భారత్ రైళ్లను కేటాయించింది ప్రభుత్వం. వీటితో పాటు మరో 3 వందే భారత్ రైళ్లకు ఒకేసారి మోదీ జెండా ఊపి ప్రారంభించారు. మధ్యప్రదేశ్ లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ నుంచి రెండు రైళ్లను నేరుగా, మూడు రైళ్లను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు మోదీ.
మధ్యప్రదేశ్ లో ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో ఒకటి రాణి కమలాపతి-జబల్ పూర్ స్టేషన్ల మధ్య నడుస్తుంది. జబల్ పూర్, భోపాల్ రీజియన్లను ఇది కలుపుతుంది. ఈ మార్గంలో అత్యంత వేగంగా వెళ్లే ఎక్స్ ప్రెస్ కంటే 30 నిమిషాలు ముందుగానే వందే భారత్ ప్రయాణం పూర్తవుతుంది. రెండోది ఖజురహో-భోపాల్-ఇండోర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్. ఈ రైలు మాత్రం ప్రయాణ సమయాన్ని బాగా తగ్గిస్తోంది. గతంలో ఇదే మార్గంలో ప్రయాణించే ఎక్స్ ప్రెస్ ల కంటే రెండు గంటలు ఎక్కువ వేగంగా ఇది గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. గోవా, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్ తో కనెక్టివిటీ ఉన్న మరో మూడు వందే భారత్ లను కూడా నరేంద్రమోదీ ప్రారంభించడం విశేషం.
ఎన్నికల ఏడాదిలో మధ్యప్రదేశ్ కి కేంద్రంలోని బీజేపీ తాయిలాలు ప్రకటిస్తోంది. ఇప్పటికే కర్నాటకలో కాంగ్రెస్ చేతిలో చావుదెబ్బ తిన్నది బీజేపీ. మధ్యప్రదేశ్ లో కూడా అలాంటి పరిస్థితే ఉంది. కర్నాటకతో పాటు, మధ్యప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలను కూలదోసి బీజేపీ గద్దనెక్కింది. కర్నాటకలో ప్రజలు ఈపాటికే బుద్ధి చెప్పారు, ఇప్పుడు మధ్యప్రదేశ్ లో కూడా అలాంటి రిజల్ట్ వస్తుందని బీజేపీ భయపడుతోంది. దీంతో బీజేపీ అధినాయకత్వం మరింత ఎక్కువగా ఆ రాష్ట్రంపై ఫోకస్ పెడుతోంది. ఒకేరోజు రెండు వందే భారత్ రైళ్లను మధ్యప్రదేశ్ కి అంకితమిచ్చి ఎన్నికల ఏడాదిలో తాయిలాల పరంపర కొనసాగించారు మోదీ.