మోదీ 'ఇండియా' కలవరం.. రాజస్థాన్ లోనూ అదే స్మరణ

కొన్ని కంపెనీలు బోర్డు తిప్పేసి ఆ తర్వాత పేరు మార్చుకుని మళ్లీ వస్తుంటాయని.. యూపీఏ కూడా అలాగే పేరు మార్చుకుందని ఎద్దేవా చేశారు ప్రధాని మోదీ.

Advertisement
Update:2023-07-27 15:55 IST

విపక్ష 'ఇండియా' కూటమి, ప్రధాని మోదీకి నిద్రలేకుండా చేస్తున్నట్టు అర్థమవుతోంది. ఆమధ్య 'ఇండియా' అనే పేరుపై సెటైర్లు పేల్చారు మోదీ. ఈస్టిండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదిన్ అనే సంస్థల పేర్లలో కూడా ఆ పదం ఉందని.. అది ఉన్నంత మాత్రాన ప్రజలు విపక్షాలను నమ్మబోరని అన్నారు. తాజాగా రాజస్థాన్ లో జరిగిన కార్యక్రమంలో కూడా 'ఇండియా' పై విమర్శలు గుప్పించారు. గతంలో చేసిన తప్పులను దాచి పెట్టేందుకే యూపీఏ.. 'ఇండియా'గా మారిందన్నారు మోదీ.

రాజస్థాన్‌ లోని సీకర్‌ లో 1.25 లక్షల ‘పీఎం కిసాన్‌ సమృద్ధి కేంద్రాలను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. రైతులకోసం తమ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేసిందన్నారు. విత్తనాలనుంచి, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ వరకు రైతులకు పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలు అండగా ఉంటాయని చెప్పారు. రాజస్థాన్ లో జరిగిన బహిరంగ సభలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. రాజస్థాన్‌ లో కలకలం రేపిన ‘రెడ్‌ డైరీ’లోని రహస్యాలు.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ని నాశనం చేస్తాయన్నారు.


విపక్ష కూటమి 'ఇండియా'పై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు ప్రధాని మోదీ. పేదలకు వ్యతిరేకంగా పన్నిన కుట్రలు దాచుకునేందుకు ప్రతిపక్షం పేరు మార్చుకుందని విమర్శించారు. కొన్ని కంపెనీలు బోర్డు తిప్పేసి ఆ తర్వాత పేరు మార్చుకుని మళ్లీ వస్తుంటాయని.. యూపీఏ కూడా అలాగే పేరు మార్చుకుందని ఎద్దేవా చేశారు. ఉగ్రవాదం ముందు లొంగిపోయామనే అపవాదుని తొలగించుకునేందుకు పేరులో 'ఇండియా'ని పెట్టుకుని లేని దేశభక్తిని చూపిస్తున్నారని మండిపడ్డారు. పదే పదే 'ఇండియా' పేరుని ప్రస్తావిస్తూ విపక్ష కూటమి కొత్త పేరుకి మోదీ మరింత ప్రచారం కల్పిస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వినపడుతున్నాయి. 

Tags:    
Advertisement

Similar News