కోటాలో విద్యార్థి అదృశ్యం కేసు.. 23 రోజుల తర్వాత గోవాలో ప్రత్యక్షం..!
తమ కుమారుడు అదృశ్యమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు అతడి ఆచూకీ గుర్తించేందుకు ప్రయత్నాలు చేయలేదని.. సొంతంగా తామే గాలించామని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు.
'నీట్' పరీక్షకు అద్భుతమైన శిక్షణ ఇస్తుందన్న పేరు రాజస్థాన్‌లోని కోటా పట్టణానికి ఉంది. అయితే శిక్షణ కోసం దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే విద్యార్థులు ఒత్తిడి భరించలేక ఆత్మహత్యలు చేసుకునే సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇలా ఒత్తిడి తట్టుకోలేక ఓ విద్యార్థి ఐదేళ్లు తనకోసం వెతుకొద్దంటూ తల్లిదండ్రులకు చెప్పి గత నెల 6న కోటా నుంచి అదృశ్యమయ్యాడు. అప్పుడు మాయమైన విద్యార్థి దేశమంతా చుట్టి చివరికి 23 రోజుల తర్వాత గోవాలో ప్రత్యక్షమయ్యాడు.
రాజస్థాన్‌లోని బమన్ వాస్ ప్రాంతానికి చెందిన రాజేంద్రప్రసాద్ కోటాలో నీట్ కోసం కొంతకాలంగా శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే గత నెల 5న నీట్ పరీక్ష జరగగా.. రాజేంద్రప్రసాద్ సరిగ్గా రాయలేకపోయాడు. దీంతో మనస్తాపం చెందిన అతడు కోటా నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు.
తనకు ఉన్నత చదువులు చదువుకోవాలని లేదని.. అందుకే కోటా నుంచి వెళ్ళిపోతున్నానని.. మరో ఐదేళ్లు తిరిగి రానని.. తండ్రికి మెసేజ్ పంపి అదృశ్యమయ్యాడు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు కోటా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు, విద్యార్థి కుటుంబ సభ్యులు బృందాలుగా ఏర్పడి అతడి జాడ కోసం వెతకడం మొదలుపెట్టారు. చివరికి 23 రోజుల తర్వాత రాజేంద్ర ఆచూకీని తల్లిదండ్రులే గుర్తించారు.
గోవాలో అతడు కనిపించడంతో నచ్చజెప్పి ఇంటికి తీసుకెళ్లారు. తమ కుమారుడు అదృశ్యమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు అతడి ఆచూకీ గుర్తించేందుకు ప్రయత్నాలు చేయలేదని.. సొంతంగా తామే గాలించామని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు. పూణేలో రాజేంద్ర కొత్త సిమ్ కార్డు కొన్నప్పుడే అతడిని గుర్తించే అవకాశం వచ్చినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. అయితే దీనిని పోలీసులు ఖండించారు. విద్యార్థి కుటుంబ సభ్యుల వెంట పోలీసు బృందాలను పంపినట్లు తెలిపారు.
23 రోజుల్లోనే దేశమంతా చుట్టేసిన విద్యార్థి
మే 6న కోటా నుంచి అదృశ్యమైన విద్యార్థి రాజేంద్ర ఖర్చులకోసం తన వద్ద ఉన్న పుస్తకాలు, సెల్ ఫోన్, రెండు సైకిళ్ళు అమ్మేసి రూ. 11వేలు పోగేసుకున్నాడు. ఆ తర్వాత రైలెక్కి పూణేకి చేరుకున్నాడు. తన ఆధార్ కార్డుతో కొత్త సిమ్, రూ. 1500తో సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుక్కున్నాడు. అక్కడి నుంచి రాజేంద్రప్రసాద్ వరుసగా దేశంలోని పలు ప్రాంతాలను సందర్శించాడు.
అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయం, జమ్మూ వైష్ణో దేవి ఆలయం, తాజ్ మహల్, ఒడిశాలోని పూరీ క్షేత్రం, తమిళనాడులోని రామేశ్వరం, కన్యాకుమారి, కేరళలోని తిరువనంతపురం ప్రాంతాలను సందర్శించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి గోవాకు చేరుకున్నాడు.
విద్యార్థి దేశమంతా తిరుగుతున్న క్రమంలో సీసీ టీవీ ఫుటేజీ సహాయంతో అతడి కదలికలను తల్లిదండ్రులు గమనించారు. చివరికి అతడు గోవాలో ఉన్నట్లు తెలుసుకొని కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. మడ్ గావ్ రైల్వే స్టేషన్ లో విద్యార్థి మరో రైలు ఎక్కుతుండగా తండ్రి పిలుపుతో ఆగి దగ్గరికి చేరుకున్నాడు. ఇంట్లోనే ఉండి ఇష్టమైనదే చదువుకోవాలని తమ కుమారుడిని తాము కోరినట్లు విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు.
రూ. 11 వేలతో కోటా నుంచి మాయమైన రాజేంద్ర దేశంలోని చాలా ప్రదేశాలు తిరిగినప్పటికీ అతడి వద్ద ఇంకా రూ.5 వేలు మిగిలి ఉండడం గమనార్హం. రాజేంద్ర తన ప్రయాణాలన్నీ రైళ్లలోనే చేశాడు. చాలావరకు టికెట్ లేకుండానే ప్రయాణాలు కొనసాగించడంతో వెంట తీసుకెళ్లిన డబ్బులో కొంత మిగిల్చాడు.