ఢిల్లీ సీఎం ప్రమాణానికి భారీగా ఏర్పాట్లు
పాల్గొననున్న 50 మంది సినీతారలు, పారిశ్రామిక వేత్తలు, 20 రాష్ట్రాల సీఎంలు, ఆధ్యాత్మిక గురువులు
సుమారు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారం చేజిక్కించుకున్న బీజేపీ ప్రమాణస్వీకారోత్సవానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 20న జరిగే ఈ కార్యక్రమానికి 20 రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు హాజరుకానున్నారు. అలాగే 50 మంది సినీతారలు పారిశ్రామికవేత్తలు, ఇతర దేశాల దౌత్యవేత్తలను ఆహ్వానించినట్లు సమాచారం. ఇంకా ఢిల్లీకి చెందిన పలువురు రైతులు, కేంద్ర పథకాల లబ్ధిదారులను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. యోగా గురువు బాబా రాందేవ్, స్వామి చిదానంద, బాబా బాగేశ్వర్ ధీరేంద్ర శాస్త్రి వంటి ఆధ్యాత్మిక గురువులు ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నారు. ఎల్లండి సాయంత్రం 4.30 గంటలకు జరిగే ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి రాంలీలా మైదానంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీలోని 70 శాసనసభా స్థానాలకు ఈ నెల 5న పోలింగ్ జరగ్గా.. 8న ఫలితాల్లో 48 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. 22 స్థానాలతో ఆప్ అధికారం కోల్పోయింది. సీఎం రేసులో మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. ఆప్ అధినేత కేజ్రీవాల్‌పై ఆయన ఘన విజయం సాధించారు. రేపు సమావేశం కానున్న బీజేపీ శాసనసభా పక్షం ఢిల్లీ కొత్త సీఎంను ఎన్నుకోనున్నది. అందులో కొత్త సీఎంతో ఆపటు కేబినెట్ మంత్రులను ఎన్నుకోనున్నారు.