భారత రాజకీయ చరిత్రలో 'పాదయాత్ర'లది ప్రత్యేక స్థానం.. వాటిలో కొన్ని..

భారత స్వతంత్రానికి పూర్వమే పాదయాత్రలు నిర్వహించిన చరిత్ర ఉంది. ఇండిపెండెన్స్ అనంతరం కూడా చాలా మంది రాజకీయ నాయకులు పాదయాత్రలు నిర్వహించారు. వాటిలో ముఖ్యమైనవి ఇప్పుడు కొన్ని చూద్దాం..

Advertisement
Update:2022-09-06 10:30 IST

రాజకీయాలకు, పాదయాత్రలకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఈ దేశంలో చాలా మంది పొలిటీషియన్స్ అధికారం కోసం పాదయాత్రలు చేసి విజయవంతం అయ్యారు. సుదీర్ఘ పాదయాత్రల్లో ప్రజల సమస్యలు, వారి అవసరాలు తెలుసుకొని తమదైన ప్రణాళికను సిద్ధం చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. దేశంలో ఎన్నో పాదయాత్రలు చూశాం. సెప్టెంబర్ 7 నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజుల పాటు 3,570 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. అయితే భారత స్వతంత్రానికి పూర్వమే పాదయాత్రలు నిర్వహించిన చరిత్ర ఉంది. ఇండిపెండెన్స్ అనంతరం కూడా చాలా మంది రాజకీయ నాయకులు పాదయాత్రలు నిర్వహించారు. వాటిలో ముఖ్యమైనవి ఇప్పుడు కొన్ని చూద్దాం..

మహాత్మా గాంధీ ఈ ఆధునిక పాదయాత్రలకు పితామహుడు అని చెప్పుకోవచ్చు. 1930లో 388 కిలోమీటర్ల మేర దండి మార్చ్ నిర్వహించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఉప్పుపై వేసిన పన్ను రద్దు చేయాలని కోరుతూ ఆయన చేసిన పాదయాత్ర.. స్వాతంత్ర పోరాటంలో కీలక మలుపుగా చరిత్రకారులు చెప్తారు. ఇప్పటి రాజకీయ నాయకుల పాదయాత్రలకు ఆనాడు జాతిపిత గాంధీ మహాత్ముడు చేసిన 'దండి మార్చ్' స్పూర్తిగా నిలిచింది. సమాజంలోని పలు సమస్యలను గుర్తించి.. వాటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో పాదయాత్రలు చాలా చక్కగా ఉపయోగపడుతాయి. అదే సమయంలో అనేక మందిని అభిమానులుగా చేసుకోవచ్చు. ప్రజలకు దగ్గర అవడానికి ఈ పాదయాత్రలకు మించింది లేదు.

మహాత్మాగాంధీ తర్వాత దేశ ప్రజలకు గుర్తుండిపోయిన పాదయాత్రను మాజీ ప్రధాని చంద్రశేఖర్ చేశారు. కన్యాకుమారి నుంచి ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వరకు 4,260 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ప్రజల సమస్యలను అవగాహన చేసుకోవడానికి ఈ పాదయాత్ర చేస్తున్నానని చంద్రశేఖర్ చెప్పారు. దీనికి 'భారత్ యాత్ర' అని పేరు పెట్టారు. 1983 జనవరి 6న ప్రారంభమైన ఈ యాత్ర అదే ఏడాది జూన్ 25న ముగిసింది.

ఇక నాలుగేళ్ల తర్వాత 1983 ఏప్రిల్‌లో సినీ నటుడు సునీల్ దత్ 78 రోజుల 'మహాశాంతి పాదయాత్ర' చేశారు. ఆయన యాత్రలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు. అయితే దేశంలో పెరుగుతున్న అశాంతిని తగ్గించి.. మతసామరస్యానికి పెంపొందించడానికి ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దాదాపు 2000 కిలోమీటర్ల మేర నిర్వహించిన ఈ పాదయాత్ర అమృత్‌సర్‌లో ముగిసింది. అప్పట్లో పంజాబ్‌లో మిలిటెన్సీ ఎక్కువగా ఉండేది. అందుకే ఆయన పాదయాత్రకు భారీ భద్రత కల్పించారు. తన పాదయాత్రకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలే లేవని చెప్పినా.. ఎక్కడ సునీల్ దత్‌పై దాడి జరుగుతుందో అని అభిమానులు ఆందోళన చెందారు.

ఇక 2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర నేటి తరానికి ఓ సంచలనం. ఉమ్మడి ఏపీలోని రాజకీయ స్థితిగతులనే మార్చేసిన అద్భుత యాత్ర అది. 2003లో తెలంగాణలోని చేవెళ్లలో ప్రారంభించి మూడు నెలల పాటు 1,475 కిలోమీటర్లు నడిచి ఇచ్ఛాపురం వద్ద యాత్రను ముగించారు. ఆ పాదయాత్ర తనను రాజకీయ నాయకుడిగానే కాకుండా ఓ మనిషిగా కూడా ఎంతో మార్పు చెందడానికి ఉపయోగపడిందని వైఎస్ఆర్ చెప్పారు. ఇప్పటికీ పాదయాత్ర అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్ఆర్ గుర్తుకు వస్తారు.

ఇక ఉమ్మడి ఏపీ విడిపోవడానికి ఏడాది ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2013లో ఓ పాదయాత్ర చేశారు. 1700 కిలోమీటర్ల పాటు ఏపీలో ఆయన నిర్వహించిన పాదయాత్ర.. ఆ తర్వాత కాలంలో ఏపీ విడిపోయిన తర్వాత తొలి ముఖ్యమంత్రి హోదాను అందించింది. ఆయన పాదయాత్ర ఆసాంతం ఎన్నికలే లక్ష్యంగా సాగాయి.

2017లో తండ్రి వైఎస్ఆర్ బాటలోనే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేశారు. 2017 నవంబర్ 6న కడప జిల్లాలో ప్రారంభమైన యాత్ర 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో ముగిసింది. 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర చేసిన ఈ పాదయాత్ర.. ఇప్పటి వరకు భారత రాజకీయ నాయకులల్లో అత్యంత సుదీర్ఘకాలం చేపట్టిన యాత్రగా రికార్డులకు ఎక్కింది. ఈ పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్ దాదాపు 2 కోట్ల మందిని ప్రత్యక్షంగా కలిశారు. వారి సాదకబాధకాలు తెలుసుకొని నవరత్నాలకు రూపకల్పన చేశారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మొన్నటి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు, కేంద్ర మంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్‌లో కూడా పాదయాత్రలు చేశారు. దిగ్విజయ్ యాత్ర అక్కడ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చింది. కానీ అమిత్ షా మాత్రం మమత ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపలేదు.

పాదయాత్రలు కాకుండా ఎల్‌కే అద్వాని చేపట్టిన రథయాత్ర చాలా పాపులర్ అయ్యింది. బీజేపీని దేశవ్యాప్తంగా పరిచయం చేసిన యాత్ర అది. అయితే ఆ యాత్ర రాజకీయ పరమైనదిగా కంటే.. మత పరమైనదిగా చాలా మంది భావిస్తారు. ఇక టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎన్టీఆర్ 'చైతన్య రథం' మీద ఏపీ అంతా సుడిగాలి పర్యటన చేశారు. రోడ్ల పక్కనే స్నానం, అక్కడే తినడం ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్‌కు బ్రహ్మరథం పట్టారు.

Tags:    
Advertisement

Similar News