అది సహజీవనం కాదు.. వ్యభిచార జీవితం - స్పష్టం చేసిన హైకోర్టు

కేవలం వ్యభిచారం కేసులో విచారణను తప్పించుకోవడానికే ఈ పిటిషన్‌ వేసినట్లు కనిపిస్తోందని ఈ కేసును విచారించిన న్యాయమూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు తెలిపారు.

Advertisement
Update:2023-11-15 07:52 IST

జీవిత భాగస్వామితో విడాకులు పొందకుండా వేరొక వ్యక్తితో కలిసి ఉండటాన్ని ’సహజీవనం’గా పరిగణించలేమని పంజాబ్‌-హరియాణా హైకోర్టు స్పష్టం చేసింది. అలాంటి వ్యక్తి కామపూరిత, వ్యభిచార జీవితం గడుపుతున్నట్టేనని అభిప్రాయపడింది.

పంజాబ్‌కు చెందిన ఓ జంట తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు కొట్టివేసింది. పంజాబ్‌కు చెందిన ఇద్దరు గత కొంతకాలంగా సహజీవనంలో ఉన్నారు. మహిళ అవివాహిత కాగా, పురుషుడికి వివాహమైంది. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భార్యతో మనస్పర్థల నేపథ్యంలో ఆమెకు దూరంగా ఉంటున్నాడు.

ఈ క్రమంలో సహజీవనంలో ఉంటున్న అవివాహిత మహిళ, పురుషుడు ఇటీవల అక్కడి హైకోర్టును ఆశ్రయించారు. తమకు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు.

తమ ప్రాణాలకు రక్షణ, స్వేచ్ఛ కల్పించాలని వారు అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ కుల్దీప్‌ తివారీతో కూడిన ఏకసభ్య ధర్మాసనం మునుపటి బంధం నుంచి విడాకులు పొందకుండా వేరొక మహిళతో పిటిషనర్‌ కామంతో కూడిన, వ్యభిచార జీవితాన్ని గడుపుతున్నాడని పేర్కొంది.

ఇది శిక్షార్హమైన నేరమే అవుతుందని తెలిపింది. అంతేగాక తమ ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పే ఆధారాలేమీ పిటిషనర్లు చూపించలేదని పేర్కొంది. కేవలం వ్యభిచారం కేసులో విచారణను తప్పించుకోవడానికే ఈ పిటిషన్‌ వేసినట్లు కనిపిస్తోందని ఈ కేసును విచారించిన న్యాయమూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News