బెట్టింగ్‌ యాప్‌ కేసు : కపిల్‌ శర్మ, హ్యూమా ఖురేషి, హీనా ఖాన్‌లకు నోటీసులు

మహాదేవ్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్లు సౌరభ్‌ చంద్రకర్, రవి ఉప్పల్‌ భారత్‌లో 4 వేల మంది ఆపరేటర్లను నియమించుకున్నారు. ఒక్కో ఆపరేటర్‌కు సుమారు 200 మంది కస్టమర్లు ఉన్నారు.

Advertisement
Update:2023-10-06 08:32 IST

మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసులో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌కు సమన్లు జారీ చేసిన మరుసటి రోజే బాలీవుడ్‌ హాస్యనటుడు కపిల్‌ శర్మ, నటీమణులు హ్యూమా ఖురేషి, హీనా ఖాన్లకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సమన్లు జారీ చేసింది. రణ్‌బీర్‌కు బుధవారం నోటీసులు ఇచ్చిన ఈడీ.. ఈనెల 6వ తేదీ (నేడు) రాయపూర్‌లోని ఈడీ రీజనల్‌ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని పేర్కొంది. అయితే.. రణ్‌బీర్‌ తన హాజరుకు రెండు వారాల సమయం కోరినట్టు తెలుస్తోంది. గురువారం నోటీసులు అందుకున్న కపిల్‌ శర్మ, హ్యూమా ఖురేషి, హీనా ఖాన్లను వేర్వేరు తేదీల్లో ప్రశ్నించనున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. అయితే ఈ ముగ్గురు నిందితులు కారని, హవాలా వ్యవహారంలో చెల్లింపులు ఎలా జరిగాయన్నది తెలుసుకోవడానికే వీరిని విచారించనున్నారని తెలుస్తోంది.

మహాదేవ్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్లు సౌరభ్‌ చంద్రకర్, రవి ఉప్పల్‌ భారత్‌లో 4 వేల మంది ఆపరేటర్లను నియమించుకున్నారు. ఒక్కో ఆపరేటర్‌కు సుమారు 200 మంది కస్టమర్లు ఉన్నారు. ఆ లెక్కన రోజుకు రూ.200 కోట్లు చేతులు మారుతోంది. 70–30 నిష్పత్తి ప్రకారం లాభాల్లో వాటా ఇస్తామని వివిధ దేశాల్లో బీటర్లను వీరు నియమించుకున్నట్టు తెలుస్తోంది. ఈ యాప్‌ కార్యకలాపాలు యూఏఈ ప్రధాన కేంద్రంగా సాగుతున్నట్టు ఈడీ విచారణలో తేలింది. యాప్‌ ప్రమోటర్లు సౌరభ్‌ చంద్రకర్, రవి ఉప్పల్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నారని ఈడీ అధికారులు వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News