రైల్వేలో ఒక్కో ఎలుకని పట్టుకోవడానికి 41 వేలు

నార్తర్న్ రైల్వే పరిధిలో ఢిల్లీ, అంబాలా, లక్నో, ఫిరోజ్ పూర్, మొరాదాబాద్ డివిజన్లు ఉన్నాయి. చంద్ర‌శేఖర్ గౌర్ మొత్తం ఉత్తర రైల్వే వ్యాప్తంగా ఈ సమాచారం కోరారు

Advertisement
Update:2023-09-16 18:10 IST

ఇంట్లో ఎలుకలు ఎక్కువైతే ఏం చేస్తాం.. పాతికో, యాభై పెట్టి ఎలుకల మందు కొంటాం.. లేకపోతే కాస్త కష్టపడైనా ఎలుకల బోను వాడుతాం.. అంతే గానీ దానికోసం వేలకు వేలు అయితే ఖర్చు పెట్టం కదా.. కానీ, నార్తర్న్ రైల్వే లక్నో డివిజన్ మాత్రం ఒక అద్భుతమైన ఘనత సాధించింది. ఒక్కో ఎలుకను పట్టుకోవటానికి ఈ రైల్వే అధికారులు ఏకంగా రూ.41వేలు పైనే ఖర్చు చేశారు.

నీముచ్‌కు చెందిన ఆర్టీఏ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ సమాచార హక్కు చట్టం కింద కోరినప్పుడు రైల్వే శాఖ స్వయంగా ఈ వివరాలు బయట పెట్టింది. నార్త్ రైల్వే లక్నో డివిజన్ 2020 నుంచి 2022 వరకు ఎలుకలను పట్టడం కోసం రూ.69.5 లక్షలు ఖర్చు పెట్టిందని తెలియజేసింది. ఇంతకీ రైల్వే శాఖ పట్టిన ఎలుకలు ఎన్నో తెలుసా..? 168 ఎలుకలు. అంటే ఒక్కో ఎలుక కోసం పెట్టిన ఖర్చు 41 వేలు.

నార్తర్న్ రైల్వే పరిధిలో ఢిల్లీ, అంబాలా, లక్నో, ఫిరోజ్ పూర్, మొరాదాబాద్ డివిజన్లు ఉన్నాయి. చంద్ర‌శేఖర్ గౌర్ మొత్తం ఉత్తర రైల్వే వ్యాప్తంగా ఈ సమాచారం కోరారు. అయితే ఒక్క లక్నో డివిజన్ మాత్రమే స్పష్టమైన సమాచారం ఇచ్చింది. అటు అంబాలా డివిజన్ 2020 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు ఎలుకలు, చెదల నివారణకు రూ.39.3 లక్షలు ఖర్చు చేసినట్టు తెలిపింది.

అయితే అసలు ఎలుకల కారణంగా రైల్వేకి జరిగిన నష్టం ఎంత? అన్న గౌర్ ప్రశ్నకు ఎవరూ కూడా సమాచారం ఇవ్వలేదు. నష్టపోయిన గూడ్స్, వస్తువులకు సంబంధించిన సమాచారం తమ వద్ద లేదని, నష్టాన్ని తాము అంచనా వేయలేదని లక్నో డివిజన్ తెలిపింది. కొండని తవ్వి ఎలుకని పట్టడం అంటే ఇదేనేమో.

Tags:    
Advertisement

Similar News