`ది కేరళ స్టోరీ`పై ఖుష్బూ ట్వీట్ వివాదాస్పదం.. - కపిల్ సిబల్ కౌంటర్
ప్రజలు ఏం చూడాలో వారే నిర్ణయించుకుంటారని అనేటప్పుడు.. పీకే, పఠాన్, బాజీరావ్ మస్తానీ.. వంటి సినిమాలకు వ్యతిరేకంగా ఎందుకు నిరసనలు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
తీవ్ర వివాదాస్పదంగా మారిన `ది కేరళ స్టోరీ` మూవీపై బీజేపీ నాయకురాలు, సినీ నటి ఖుష్బూ తాజాగా చేసిన ట్వీట్ మరింత చిచ్చు రేపుతోంది. ``ఎన్నో ఏళ్లుగా చాలామందికి తెలియని నిజాలను ఈ చిత్రంలో చూపించారు. అసలు నిజాలేమిటో నిర్మొహమాటంగా చిత్రీకరించారు. ఈ విషయంలో ప్రజలు ఏం చూడాలో వారే నిర్ణయించుకుంటారు. అంతేగానీ మీరు నిర్ణయించకూడదు. తమిళనాడు ప్రభుత్వం ఏవో కారణాలను చూపి ఈ చిత్రం ప్రదర్శనలను రద్దు చేస్తోంది. దీని ద్వారా ఇది తప్పకుండా అందరూ చూడాల్సిన సినిమాగా పరోక్షంగా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు`` అని ఖుష్బూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఖుష్బూ ట్వీట్‌పై రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ ఘాటుగా స్పందించారు. ఆమె చేసిన ట్వీట్‌పై మంగళవారం నాడు ట్విట్టర్ వేదికగా ఆయన మండిపడ్డారు. ప్రజలు ఏం చూడాలో వారే నిర్ణయించుకుంటారని అనేటప్పుడు.. పీకే, పఠాన్, బాజీరావ్ మస్తానీ.. వంటి సినిమాలకు వ్యతిరేకంగా ఎందుకు నిరసనలు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. మీ రాజకీయాలు ద్వేషాలను పెంచేవిధంగా ఉన్నాయంటూ మండిపడ్డారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ చిత్రంపై అనేకమంది అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, ఈ చిత్ర ప్రదర్శనను పలు రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేస్తున్న విషయం తెలిసిందే. తొలుత పశ్చిమ బెంగాల్‌లో ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేశారు. ఆ తర్వాత తమిళనాడు, పంజాబ్ తదితర రాష్ట్రాలలోనూ ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేశారు.