ఎన్నికలకోసమే ఎల్జీ.. కేంద్రంపై కేజ్రీవాల్ ఫైర్
ఢిల్లీలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా తన వల్లే బీజేపీకి లబ్ధి చేకూరుతుందని, తాను ఉంటే కచ్చితంగా 7 అసెంబ్లీ సీట్లు బీజేపీ గెలుచుకుంటుందని అన్నారట లెఫ్ట్ నెంట్ గవర్నర్.
ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ సక్సేనాతో సీఎం కేజ్రీవాల్ గొడవ ముదిరి పాకాన పడింది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఎల్జీ ఏ విధంగా బీజేపీకి సాయపడ్డారో వివరించారు కేజ్రీవాల్. ఆ విషయాన్ని సక్సేనా తనతో స్వయంగా చెప్పారని కేజ్రీవాల్ ప్రకటించడం సంచలనంగా మారింది. తనవల్లే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి 104 సీట్లు వచ్చాయని, లేకపోతే కేవలం 20సీట్లు మాత్రమే వచ్చేవని లెఫ్ట్ నెంట్ గవర్నర్ సక్సేనా తనతో అన్నట్టుగా కేజ్రీవాల్ మీడియాకి చెప్పారు. ఢిల్లీలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా తన వల్లే బీజేపీకి లబ్ధి చేకూరుతుందని, తాను ఉంటే కచ్చితంగా 7 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటుందని అన్నారట లెఫ్ట్ నెంట్ గవర్నర్. ఈ వ్యవహారాలన్నీ బయటపెట్టినా ఎల్జీని కేంద్రం అక్కడినుంచి కదల్చబోదని మండిపడ్డారు కేజ్రీవాల్.
ఢిల్లీలో ఇటీవల పలు సందర్భాల్లో లెఫ్ట్ నెంట్ గవర్నర్ సక్సేనా, సీఎం కేజ్రీవాల్ మధ్య విభేదాలు తలెత్తాయి. ఢిల్లీలో పోలీస్ వ్యవస్థ, ల్యాండ్ ఇష్యూస్, పబ్లిక్ ఆర్డర్ అనే మూడు వ్యవహారాలు ఎల్జీకి రిజర్వ్ అయి ఉన్నాయని, కానీ అన్నిట్లోనూ ఆయన వేలు పెడుతున్నారని ఇటీవల కేజ్రీవాల్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఇతర అన్ని విషయాలపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను కలిగి ఉంటుందని కానీ, ఎల్జీ అన్ని విషయాల్లోనూ అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు మొహల్లా క్లినిక్, జల్ బోర్డు చెల్లింపులను కూడా ఆయన నిలిపివేశారని ఆరోపించారు. తాజాగా ఆయన ఢిల్లీ టీచర్ల ఫిన్లాండ్ శిక్షణా తరగతులను అడ్డుకోవడంతో మరోసారి వివాదం ముదిరింది. కావాలనే ఉపాధ్యాయులకు ఫిన్లాండ్ వెళ్లే అవకాశం లేకుండా చేశారని, ఎల్జీ పర్మిషన్ ఇవ్వకపోవడం దారుణం అని అన్నారు కేజ్రీవాల్. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అడ్డుకునేందుకు ఎల్జీ ఎవరని నిలదీశారు.
శిక్షణకోసం ఉపాధ్యాయులను ఫిన్లాండ్ పంపించాలని ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించగా.. ఎల్జీ, కాస్ట్ బెనిఫిట్ అనాలసిస్ అడగడంతో అక్కడ బ్రేక్ పడింది. రాష్ట్రపతి తనను నియమించారని ఎల్జీ అనడం సరికాదన్నారు కేజ్రీవాల్. గతంలో బ్రిటిష్ వారు వైస్రాయ్ లను నియమించగా.. వారు ఇండియన్లకు పాలించడం చేతకాదని అనేవారని, ఇప్పుడు ఢిల్లీవాసులకు పరిపాలించడం చేతకాదని ఎల్జీ అంటున్నారని మండిపడ్డారు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని, అది ఎల్జీ గుర్తు పెట్టుకోవాలని సూచించారు కేజ్రీవాల్.