ప్రశాంత్ కిషోర్ ఓ వ్యాపారి.. జేడీయూకి అవసరం లేదు..

మా సీఎం ఆహ్వానించేంత సీన్ పీకేకి లేదని, అతడు తమ పార్టీకి అవసరం లేదని అన్నారు జేడీయూ అధ్యక్షుడు రాజీవ్ రాజన్ సింగ్. పీకేపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అతను రాజకీయ వ్యూహకర్త కాదని, కేవలం ఓ వ్యాపారి అని అన్నారు.

Advertisement
Update:2022-09-18 07:47 IST

ఇటీవల బీహార్ సీఎం నితీష్ కుమార్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ తర్వాత వారిద్దరూ కలసిపోయారనే ప్రచారం జరిగింది. అయితే నితీష్ తనను పార్టీలోకి ఆహ్వానించినా, తానే తిరస్కరించానంటూ పీకే స్టేట్ మెంట్ ఇచ్చారు. దీంతో జేడీయూకి మరింత మండింది. మా సీఎం ఆహ్వానించేంత సీన్ పీకేకి లేదని, అతడు తమ పార్టీకి అవసరం లేదని అన్నారు జేడీయూ అధ్యక్షుడు రాజీవ్ రాజన్ సింగ్. పీకేపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అతను రాజకీయ వ్యూహకర్త కాదని, కేవలం ఓ వ్యాపారి అని అన్నారు. ప్రస్తుతం ఆ వ్యాపారి బీజేపీకోసం పనిచేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.

అతని వ్యూహాలు ఎలా ఉంటాయంటే..?

కొన్ని రోజుల క్రితం తనను పీకే ఢిల్లీలో కలిశారని జేడీయూ అధ్యక్షుడు రాజన్ సింగ్ చెప్పారు. పార్టీలోకి రావాలంటే నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆయనకు తాను స్పష్టం చేశానని అన్నారు. ఆ తర్వాత సీఎం నితీష్ తో అపాయింట్ మెంట్ కుదిరిందని అయితే ఓ వ్యూహం ప్రకారం అతను దాన్ని తప్పుగా ప్రచారం చేశారని ఆరోపించారు. సీఎం తనను ఇంటికి పిలిచినా తాను వెళ్లలేదని పీకే మీడియాతో చెప్పారని, అదంతా అవాస్తవం అన్నారు. ఇటీవల సీఎం నితీష్ తో పీకే భేటీ జరిగింది. అప్పుడు కూడా.. తనని నితీష్ పార్టీలోకి ఆహ్వానించారని, మీటింగ్ కి కూడా ఆయనే తనను పిలిపించారని పీకే చెప్పుకున్నారు. దీనిపై రాజన్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. ఇవన్నీ ఆయన మార్కెటింగ్ తెలివితేటలని, లేనిదాన్ని ఉన్నట్టుగా, తనకి అనుకూలంగా చెప్పుకోవడంలో పీకేని మించినవారు లేరని చెప్పారు.

బీజేపీ వ్యూహంలో భాగంగానే, వారి ఏజెంట్ గానే ప్రశాంత్ కిషోర్ జేడీయూలోకి రావాలని చూస్తున్నారని, వారి పాచికలు తాము పారనివ్వబోమని అన్నారు జేడీయూ అధ్యక్షుడు రాజన్ సింగ్. ఆయన వ్యాఖ్యలతో పీకే-నితీష్ స్నేహం మళ్లీ చిగురిస్తోందన్న వార్తలు అవాస్తవం అని తేలిపోయాయి. మరి రాజన్ సింగ్ తీవ్ర ఆరోపణలపై పీకే స్పందిస్తారో లేదో చూడాలి.

Tags:    
Advertisement

Similar News