కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ ఆంక్షలు.. అమెరికా వైపు భారత్ విద్యార్థుల చూపు..!
కెనడా బాటలోనే ఆస్ట్రేలియా కూడా విదేశీ విద్యార్థుల రాకపై ఆంక్షలు అమలు చేస్తోంది. విదేశీ విద్యార్థుల పేర్ల రిజిస్ట్రేషన్ మీద ఆస్ట్రేలియా విధించిన ఆంక్షలు వచ్చే జనవరి నుంచి అమలు కానున్నాయి.
భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యావకాశాల కోసం బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ దేశాలకు వెళుతుంటారు. కానీ ఇప్పుడు ఇబ్బందులు పెరుగుతున్నాయి. విదేశాల నుంచి ప్రత్యేకంగా భారత్ నుంచి వచ్చే విద్యార్థుల విషయంలో ఈ దేశాలు విధాన నిర్ణయాల్లో మార్పులు తెచ్చాయి. విధాన నిర్ణయాలతోపాటు ఆంక్షలు అమలు చేయడంతో భారతీయ విద్యార్థుల్లో అనిశ్చితి, ఆందోళన పెరుగుతోంది. బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ దేశాల ప్రభుత్వాలు ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో తెచ్చిన మార్పులు విదేశీ విద్యార్థుల విద్యాభ్యాసంపైనే నేరుగా ప్రభావం చూపుతోంది. 2023 తొలి అర్ధభాగంకల్లా అమెరికా, కెనడా విద్యా సంస్థల్లో పేర్లు నమోదు చేసుకున్న విదేశీ విద్యార్థులు 34 శాతం మంది ఉంటే, తర్వాత బ్రిటన్‌లో 13 శాతం, ఆస్ట్రేలియాలో 12 శాతం, ఫ్రాన్స్‌లో ఏడు శాతం మంది విద్యార్థులు చేరారు.
భారతీయ విద్యార్థులకు ఫేవరెట్ బ్రిటన్
సుదీర్ఘ కాలంగా భారతీయ విద్యార్థులకు ఫేవరెట్ విద్యాకేంద్రంగా బ్రిటన్ ఉండేది. కానీ, ఇటీవల తెచ్చిన విధానం చాలా సవాళ్లను విసురుతోంది. కన్జర్వేటివ్ పార్టీ స్థానంలో అధికారంలోకి వస్తే లేబర్ పార్టీ విదేశీ విద్యార్థులు తమ వెంట డిపెండెంట్లు తెచ్చుకోవడానికి వ్యతిరేకంగా చట్టం చేస్తామని హామీ ఇస్తోంది. విద్యాభ్యాసం సమయంలో కుటుంబ సభ్యులను డిపెండెంట్లు తెచ్చుకోకుండా అడ్డుకునేందుకు ఈ నిబంధన గణనీయ పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది.
విదేశీ విద్యార్థులకు స్వాగతం పలికే కెనడాలోనూ మార్పు
విదేశీ విద్యార్థులకు స్వాగత తోరణం పలికే కెనడా సైతం ప్రస్తుతం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. పప్పీ మిల్ కాలేజీలపైప్రభుత్వం కొరడా ఝుళిపించడంతో పలు విద్యా సంస్థలు తాము నిర్వహిస్తున్న కోర్సులు, ప్రోగ్రామ్స్ మూసేశాయి. ఉన్నత విద్యాభ్యాసం కోసం వచ్చే విద్యార్థులు తమ వీసాలకు ఇన్సూరెన్స్ మీద పరిమితి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ అర్హత వంటి ఇన్సెంటివ్‌లను తొలిగించేసింది కెనడా. దీంతో కెనడాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 35 శాతం తగ్గింది.
కెనడా బాటలోనే ఆస్ట్రేలియా అడుగులు
కెనడా బాటలోనే ఆస్ట్రేలియా కూడా విదేశీ విద్యార్థుల రాకపై ఆంక్షలు అమలు చేస్తోంది. విదేశీ విద్యార్థుల పేర్ల రిజిస్ట్రేషన్ మీద ఆస్ట్రేలియా విధించిన ఆంక్షలు వచ్చే జనవరి నుంచి అమలు కానున్నాయి. డాడ్జీ ప్రొవైడర్లకుఅడ్డుకట్ట వేసేందుకు ప్రైవేట్ కాలేజీల్లో ఇష్టారాజ్యంగా కోర్సుల నిర్వహణను అడ్డుకునేందుకు కఠిన తనిఖీలు చేపట్టింది. ఆస్ట్రేలియా జీడీపీలో విదేశీ విద్యార్థుల వాటా 31.6 బిలియన్ డాలర్లుగా ఉంది. యూనివర్సిటీల వారీగా విద్యార్థుల చేరికకు పరిమితులు విధించడం, ఆస్ట్రేలియాకు వచ్చే విదేశీ విద్యార్థుల వీసా దరఖాస్తు ఫీజు 1600 ఆస్ట్రేలియా డాలర్లకు పెంచడం కూడా కారణమే.
ఇలా నెదర్లాండ్స్ ఆంక్షలు
యూనివర్సిటీల్లో విదేశీ విద్యార్థుల చేరకుండా నెదర్లాండ్స్ సర్కార్ ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రత్యేకించి ఇంగ్లీష్ బోధించే డిగ్రీల్లో విదేశీ విద్యార్థుల పేర్ల నమోదును తగ్గించడంపై దృష్టి సారించింది. యూరప్ దేశాల్లో విదేశీయుల వ్యతిరేక భావోద్వేగం పెరుగుతున్న వేళ నెదర్లాండ్స్ సర్కార్ ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం.
సిడ్నీ కేంద్రంగా స్టూడెంట్ ప్లేస్‌మెంట్ సర్వీసెస్ నిర్వహిస్తున్న ఐడీపీ ఎడ్యుకేషన్ డేటా ప్రకారం 2024 తొలి త్రైమాసికంలో బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా దేశాలకు వచ్చే వీసా అప్లికేషన్లు 20-30 శాతం తగ్గుముఖం పట్టాయి. తాజా ఆంక్షలతో విదేశీ విద్యా మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందని ఐడీపీ ఎడ్యుకేషన్ అంచనా వేసింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2025కల్లా విదేశాల్లో విద్యాభ్యాసం చేసే వారు 20-25 శాతం తగ్గుతారు.
భారతీయ విద్యార్థులు బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, నెదర్లాండ్స్ దేశాల్లో ఉన్నత విద్యాభ్యాసంతోపాటు మెరుగైన ఉద్యోగాలతో అక్కడే స్థిరపడాలని కోరుకునే వారు. తాజా ఆంక్షల వల్ల యునైటెడ్ కింగ్‌డమ్ యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకునే భారత విద్యార్థులు వెనుకాడుతున్నారు. ఐడీపీ ఎడ్యుకేషన్ అంచనా ప్రకారం 11,500 పై చిలుకు విదేశీ విద్యార్థులు ఆస్ట్రేలియా కంటే అమెరికాకే మొగ్గు చూపుతున్నారు. 2024 మార్చికల్లా భారత్ నుంచి అమెరికా యూనివర్సిటీల్లో చేరికకు 2.69 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. అమెరికాలో 2022-23లో 35 శాతం మంది విద్యార్థులు ఎక్కువగా చేరారు. గతంతో పోలిస్తే అమెరికా యూనివర్సిటీల్లో చేరే విదేశీ విద్యార్థుల్లో చైనాను భారత్ క్రాస్ చేసింది. ప్రపంచంలోనే బెస్ట్ యూనివర్సిటీల్లో సగం అమెరికాలో ఉండటం దీనికి కారణం.