రోడ్లు బాగుండటం వల్లే ప్రమాదాలు పెరిగాయ్.. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు వైరల్

ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోడ్లు బాగుంటే ప్రమాదాల సంఖ్య పెరగడం ఏంటని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

Advertisement
Update:2023-01-22 18:45 IST

రోడ్లు బాగుండటం వల్లే ప్రమాదాలు అధికంగా జరుగుతాయని మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మామూలుగా రోడ్లు గుంతలమయంగా ఉంటే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇక కొత్త మార్గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఎక్కడ ఏ గుంత ఉందో తెలియక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతుంటారు. కానీ, రోడ్లు బాగుంటేనే ప్రమాదాల సంఖ్య పెరుగుతుందని మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాండ్వా జిల్లా మంధాన బీజేపీ ఎమ్మెల్యే నారాయణ్ పటేల్ వింత‌ వాదన చేస్తున్నారు.

రాష్ట్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక్క ఖాండ్వా జిల్లాలోనే ఈ నెలలో ఇప్పటివరకు నాలుగు అతిపెద్ద ప్రమాదాలు జరిగాయి. రోడ్లు గుంతల మయంగా ఉండటంవల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయా? అని మీడియా ప్రతినిధులు నారాయణ్ పటేల్ ను ప్రశ్నించగా ఆయన వింత సమాధానం ఇచ్చారు. 'రాష్ట్రంలో, జిల్లాలో రోడ్లు అద్భుతంగా ఉన్నాయి. అందువల్లే వాహనాలు వేగంగా వెళ్తున్నాయి. ఈ క్రమంలో డ్రైవర్లు నియంత్రణ కోల్పోవడం వల్ల వాహనాలు ప్రమాదాల బారిన పడుతున్నాయి. స్వయంగా నాకు కూడా ఇటువంటి అనుభవమే ఎదురైంది. కొందరు తాగి వాహనాలు నడుపుతుండటం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి' అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోడ్లు బాగుంటే ప్రమాదాల సంఖ్య పెరగడం ఏంటని నెటిజన్లు విమర్శిస్తున్నారు. గుంతల మయమైన రోడ్లకు మరమ్మతులు చేయకుండా వితండవాదం చేయడంపై మండిపడుతున్నారు. 2017లో అమెరికాలో పర్యటించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కూడా తమ రాష్ట్రంలోని రోడ్ల గురించి గొప్పగా చెప్పుకున్నారు. అమెరికాలో కంటే మధ్యప్రదేశ్ లోనే రోడ్లు బాగున్నాయని వ్యాఖ్యానించి విమర్శల పాలయ్యారు. ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే వింత వాదన చేస్తూ విమర్శల పాలవుతున్నారు.

Tags:    
Advertisement

Similar News