గ్యాంగ్‌స్టర్‌ కమ్‌ పొలిటీషియన్‌.. ముఖ్తార్‌ అన్సారీ కథ ముగిసింది

అన్సారీ మృతితో ఆస్ప‌త్రి పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులూ తలెత్తకుండా ఉత్తరప్రదేశ్‌లో 144 సెక్షన్‌ విధించారు.

Advertisement
Update:2024-03-29 09:14 IST

గ్యాంగ్‌స్టర్‌ కమ్‌ పొలిటీషియన్‌ ముఖ్తార్‌ అన్సారీ కథ ముగిసింది. ఉత్తర ప్రదేశ్‌లోని బాందా జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్సారీ గురువారం సాయంత్రం 8.25 గంటల సమయంలో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురవగా.. జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గుండెపోటుకు గురై అన్సారీ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇది సాధారణ మరణం కాదని.. విష ఆహారం ఇచ్చి అన్సారీని చంపేశారని ఆయన సోదరుడు, ఘాజీపూర్‌ ఎంపీ అఫ్టల్‌ అన్సారీ ఆరోపిస్తున్నారు.

గ్యాంగ్‌స్టర్‌ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్‌ అన్సారీ (63) ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం గమనార్హం. అయితే.. ఆయనపై నమోదైన కేసుల్లో న్యాయస్థానం జైలుశిక్ష విధించడంతో 2005 నుంచి జైలుశిక్ష అనుభవిస్తున్నారు. రెండు రోజుల క్రితం అన్సారీ అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. ఆయనకు జైలులో విషపూరిత ఆహారం ఇచ్చారని అన్సారీ సోదరుడు, ఎంపీ అఫ్జల్‌ అన్సారీ ఆరోపిస్తుండగా.. ముఖ్తార్‌ ఆరోగ్యం బాగా లేకపోవడంతో మరుగుదొడ్డిలో పడిపోయారని జైలు అధికారులు తెలిపారు. వెంటనే ఆస్ప‌త్రికి తరలించి చికిత్స అందించామని వారు చెబుతున్నారు.

అన్సారీ మృతితో ఆస్ప‌త్రి పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులూ తలెత్తకుండా ఉత్తరప్రదేశ్‌లో 144 సెక్షన్‌ విధించారు. బాందా, మౌ, ఘాజీపుర్, వారణాసి జిల్లాల్లో అదనపు పోలీసు బలగాలతో పాటు, సెంట్రల్‌ రిజర్వ్‌ బలగాలను మోహరించినట్లు యూపీ డీజీపీ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు.

యూపీలోని మౌకు చెందిన అన్సారీపై మొత్తం 61 కేసులు నమోదయ్యాయి. అందులో 15 హత్య కేసులు ఉండటం గమనార్హం. 1980ల్లో గ్యాంగ్‌ సభ్యుడిగా చేరిన అన్సారీ 1990ల్లో సొంతంగా గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. మౌ, ఘాజీపుర్, వారణాసి ప్రాంతాల్లో ఈ గ్యాంగ్‌ దోపిడీలు, కిడ్నాపులకు పాల్పడేది. 2004లో అన్సారీ వద్ద మెషిన్‌ గన్‌ బయటపడడంతో పోలీసులు అప్పటి ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్‌ రాయ్‌ హత్య కేసులో గతేడాది ఏప్రిల్‌లో కోర్టు ఆయనకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 1990లో నకిలీ తుపాకీ లైసెన్స్‌ కలిగి ఉన్నారన్న అభియోగాల నేపథ్యంలో ఈ నెల 13న కోర్టు అన్సారీకి జీవితఖైదు విధించింది. ఐదుసార్లు మౌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ముఖ్తార్‌ రెండు సార్లు బీఎస్పీ తరపున ఎన్నికయ్యారు. ఆయన మృతికి ఆ పార్టీ ఎక్స్‌(ట్విటర్‌)లో సంతాపం ప్రకటించింది.

Tags:    
Advertisement

Similar News