మహారాష్ట్ర బీజేపీలో లుకలుకలు.. తారాస్థాయికి విభేదాలు..

మాజీ మంత్రి పంకజ ముండే అధిష్టానంపై హాట్ కామెంట్స్ చేశారు. ప్రజల హృదయాల్లో తాను ఉన్నంత కాలం.. ప్రధాని నరేంద్రమోదీ కూడా తన రాజకీయ జీవితానికి చెక్‌ పెట్టలేరు అని అన్నారామె.

Advertisement
Update:2022-10-08 14:06 IST

మహారాష్ట్రలో శివసేన చీలిక వర్గంతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మెల్లమెల్లగా కాషాయదళంలో అసంతృప్తులు పెరుగుతున్నాయి. మంత్రి పదవుల విషయంలో ఇప్పటికే చాలామంది నిరాశతో ఉన్నారని, వారంతా 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి తిరుగుబాటు జెండా ఎగరేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మాజీ మంత్రి పంకజ ముండే అధిష్టానంపై హాట్ కామెంట్స్ చేశారు. ప్రజల హృదయాల్లో తాను ఉన్నంత కాలం.. ప్రధాని నరేంద్రమోదీ కూడా తన రాజకీయ జీవితానికి చెక్‌ పెట్టలేరు అని అన్నారామె. పార్టీతో అమీతుమీ తేల్చుకోవ‌డానికి సిద్ధమయ్యారు.

దివంగత నేత గోపీనాథ్ ముండే కుమార్తెగా పంకజ ముండే మహారాష్ట్ర రాజకీయాల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్న ఆమె.. గతంలో ఫడ్నవీస్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీడ్‌ జిల్లాలోని పర్లీ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేశారు. ఎన్సీపీ అభ్యర్థి ధనుంజయ్ ముండే చేతిలో ఓడిపోయారు. ధనుంజయ్ ఆమెకు వరసకు సోదరుడు అవుతాడు. అయితే ఆ ఎన్నికల్లో సొంత పార్టీ నేతలే తన ఓటమికోసం పనిచేశారనేది పంకజ ముండే ఆరోపణ. వారికి రాష్ట్ర పార్టీ పెద్దల సహకారం కూడా ఉందని అనుమానిస్తున్నారామె. అప్పటినుంచి పార్టీ అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు పంకజ ముండే. కనీసం నామినేటెడ్ పోస్ట్ అయినా ఇస్తారని ఆశపడ్డా అధిష్టానం ఆమెకు ఆ అవకాశం ఇవ్వలేదు. కేవలం బీజేపీ జాతీయ కార్యదర్శిగా పార్టీ పదవి ఇచ్చింది.

ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చి, ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రి పదవి ఇస్తారేమోనని ఆశించిన పంకజ ముండే తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఇటీవల బీడ్‌ లో ఓ బహిరంగ సభలో పాల్గొన్న ఆమె.. 2024 ఎన్నికల కోసం అన్ని విధాలుగా సిద్ధమవుతున్నట్టు తెలిపారు. పార్టీ పిలిచి టికెట్‌ ఇస్తే సరేనని, లేకపోతే తాను ఎవరి వద్దా తలవంచబోనని చెప్పారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిని కాకపోయినా తన ప్రసంగం వినడానికి వేల మంది వచ్చారని అన్నారామె. తాను ఇతరులను తొక్కుకుంటూ పైకి రాలేదని చెప్పారు. ప్రజల మద్దతు తనకు ఉన్నంతకాలం, ప్రధాని నరేంద్రమోదీ కూడా తన రాజకీయ జీవితానికి చెక్‌ పెట్టలేరని చెబుతున్నారామె. పంకజ ముండే పార్టీని వీడితే, మరఠ్వాడాలో కీలక ఓటు బ్యాంకుగా ఉన్న వంజారి కమ్యూనిటీ పార్టీకి దూరమవుతుంది. మరికొంతమంది నేతలు కూడా పంకజ ముండేతో బయటకు వెళ్లే అవకాశముంది. పంకజ ముండే తమ పార్టీలోకి వస్తామంటే సాదరంగా స్వాగతం పలకడానికి శివసేన, ఎన్సీపీ రెడీగా ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News