కొంగ-మనిషి స్నేహం..ఎండ్ కార్డ్ వేసిన ఫారెస్ట్ ఆఫీసర్స్

అధికారులు కొంగ కోసం వచ్చి దానిని తీసుకెళ్తున్న సమయంలో కొంగను ఇంతకాలం ప్రాణంగా చూసుకున్న యువకుడు బాధతో కన్నీరు పెట్టాడు.

Advertisement
Update:2023-03-23 20:26 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమేథికి చెందిన ఓ యువ రైతు కొద్దిరోజుల కిందట వార్తల్లో నిలిచాడు. దానికి కారణం ఓ భారీ కొంగతో అతడు స్నేహం చేయడమే. కొంగ, యువకుడి స్నేహం చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఇది నిజంగా నిజమేనా.. అని నమ్మలేకపోయింది. అయితే ఈ అరుదైన స్నేహానికి ఫారెస్ట్ అధికారులు ఎండ్ కార్డ్ వేశారు. అది మనుషుల మధ్య నివసించడం అంత సేఫ్ కాదని భావించిన అటవీ శాఖ అధికారులు కొంగను పక్షుల సంరక్షణ కేంద్రానికి తరలించారు.

అధికారులు కొంగ కోసం వచ్చి దానిని తీసుకెళ్తున్న సమయంలో కొంగను ఇంతకాలం ప్రాణంగా చూసుకున్న యువకుడు బాధతో కన్నీరు పెట్టాడు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మహ్మద్ ఆరిఫ్ ఖాన్ అనే యువకుడు వ్యవసాయం చేస్తుంటాడు. ఏడాది కిందట అతడు పొలం వద్దకు వెళ్లగా.. తీవ్ర గాయాలతో కాలు విరిగిన స్థితిలో సారస్ జాతికి చెందిన ఓ భారీ కొంగ కనిపించింది. ఆరిఫ్ దానిని ఇంటికి తీసుకెళ్లాడు. గాయాలకు నాటు వైద్యం చేసి విరిగిన కాలుకు వెదురు పుల్లలతో కట్టు కట్టాడు.

కొన్ని రోజులకు ఆ కొంగ కోలుకుంది. అయితే కొంగ కోలుకున్న తర్వాత అది నివసించే చోటకు వెళుతుందని ఆరిఫ్ భావించాడు. అయితే అది తనని కాపాడిన ఆరిఫ్ ను వదలి వెళ్ళలేదు. దీంతో ఆరిఫ్ ఇంటి వద్దే దానికి ఆహారం పెట్టేవాడు. ఒక్కోసారి ఆహారం కోసం దూర ప్రాంతానికి వెళ్ళేది కొంగ. అయితే మ‌ళ్లీ సాయంత్రానికి తిరిగి వచ్చేది.

ఇక ఆ భారీ కొంగకు ఆరిఫ్ అంటే ప్రాణం. ఆరిఫ్ ఎక్కడికి వెళ్లినా వెంటే వెళ్ళేది. అతడు బైక్ పై వెళ్తే కొంగ కూడా ఆరిఫ్ ని అనుసరిస్తూ వెళ్ళేది. కొంగ, యువకుడి స్నేహం చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. ఆరిఫ్ వెంట కొంగ వెళుతున్న దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అవి వైరల్ అయ్యాయి. ఆ తర్వాత పక్షితో స్నేహం చేసిన ఆరిఫ్ ఒక వీఐపీగా మారిపోయాడు. అతడి గురించి వరుసగా మీడియాలో కథనాలు వచ్చాయి. కొంగ, యువకుడి మధ్య ఉన్న గొప్ప స్నేహం గురించి ప్రపంచం మొత్తానికి తెలిసింది.

కాగా, కొంగ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పక్షి. ఆ పక్షి ఆరిఫ్ వద్ద ఉండటం అంత సేఫ్ కాదని అటవీ శాఖ అధికారులు భావించారు. ఆరిఫ్ ఇంటి వద్దకు వచ్చి అతడితో మాట్లాడారు. ఆ కొంగను రాయ్ బరేలిలోని సమస్ పూర్ పక్షుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. కొంగను తన వద్ద నుంచి అధికారులు తీసుకు వెళ్తున్న సమయంలో ఆరిఫ్ కంటతడి పెట్టుకున్నాడు. ఏడాది నుంచి ప్రతిక్షణం కొంగ అతడిని కనిపెట్టుకునే ఉంది. ఆరిఫ్ ఎక్కడికి వెళ్ళినా కొంగను కూడా వెంట తీసుకువెళ్లేవాడు. ఇప్పుడు ఉన్నట్టుండి అది దూరం కావడంతో ఆరిఫ్ తీవ్ర వేదన చెందుతున్నాడు.

Tags:    
Advertisement

Similar News