భారత్‌లో తొలిసారి మహిళకు మంకీపాక్స్..

రోజు రోజుకీ కొత్త కేసులు వెలుగులోకి రావడంతో ఢిల్లీ ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా మంకీపాక్స్ ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయిస్తోంది.

Advertisement
Update:2022-08-04 09:19 IST

భారత్‌లో వరుసగా 8మంది పురుషులకు మంకీపాక్స్ సోకింది. మంకీపాక్స్ నిర్ధారణ అయిన తొమ్మిదో వ్యక్తి మహిళ కావడం విశేషం. భారత్ లో మంకీపాక్స్ సోకిన తొలి మహిళ ఈవిడే. అయితే ఈమె నైజీరియన్ మహిళ. మొత్తంగా ఇప్పటి వరకు భారత్‌లో 9 మంకీపాక్స్ కేసులు నమోదు కాగా.. అందులో ముగ్గురు నైజీరియన్లు ఉన్నారు. వారిలో ఒకరు మహిళ. రోజు రోజుకీ కొత్త కేసులు వెలుగులోకి రావడంతో ఢిల్లీ ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా మంకీపాక్స్ ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలోని మంకీపాక్స్ బాధితులు లోక్ నాయక్ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు.

కేరళలో ఇలా..

భారత్ లోని 9 కేసుల్లో ఢిల్లీ వాటా 4 కాగా, కేరళ వాటా 5 కేసులు. కేరళలో త్రిసూర్ జిల్లాకు చెందిన యువకుడు మంకీపాక్స్ కారణంగా మరణించాడు. తొలి కేసు కేరళలో బయటపడటమే కాదు, తొలి మరణం కూడా కేరళలోనే సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. మిగతా నలుగురు ప్రస్తుతం కేరళలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరంతా భారతీయులే. ఢిల్లీలో మాత్రం ముగ్గురు నైజీరియన్లు మంకీపాక్స్ తో బాధపడుతున్నారు.

తెలంగాణలో రెండు అనుమానిత కేసులు బయటపడినా వారికి వైరస్ నిర్ధారణ కాలేదు, ఏపీలో ఓ బాలుడికి మంకీపాక్స్ అనుమానిత లక్షణాలుండటంతో అతడి నమూనాలను పూణేలోని వైరాలజీ ల్యాబ్ కి పంపించారు. ఇతర రాష్ట్రాల్లో కూడా అనుమానిత కేసులు వస్తున్నాయి కానీ ఎక్కడా నిర్ధారణ కాలేదు. ప్రస్తుతానికి భారత్ లో మంకీపాక్స్ అంటే కేరళ, ఢిల్లీ మాత్రమే.

ప్రపంచ వ్యాప్తంగా..

ప్రపంచ వ్యాప్తంగా 78 దేశాల్లో 18 వేలకు పైగా మంకీపాక్స్ కేసులు ఇప్పటి వరకు నమోదయ్యాయి. స్పెయిన్, బ్రెజిల్ దేశాల్లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. స్పెయిన్ లో ఒకేరోజు ఇద్దరు చనిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కేసుల్లో యూరప్ వాటా 70 శాతం కాగా, 25 శాతం కేసులు అమెరికాలో ఉన్నాయి. పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ వ్యాధిని గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. శృంగార పరమైన కారణాల వల్లే 90 శాతానికి పైగా కేసులు వస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే మంకీపాక్స్ వల్ల మరణాలు సంభవిస్తున్నాయని అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News