నకిలీ ఝున్‌ఝున్‌వాలా గురించి మీకు తెలుసా? అప్పట్లో ఓ సంచలనం

చిన్న మదుపుదారులు రాకేశ్ ఇచ్చే సలహాలు, సూచనలు పాటించి లాభాలు తెచ్చుకునేవాళ్లు. అప్పట్లో పత్రికలు, మ్యాగజైన్స్‌లో రాకేశ్ సలహాలు ఇచ్చేవారు. అయితే రాకేశ్‌కు ఒక నకిలీ కూడా తయారయ్యాడు. అయితే అతడి వల్ల ఎవరికీ అపాయం, నష్టం కలగలేదు. కానీ అతడి రాతలు చదివి మాత్రం నవ్వుకునేవారు.

Advertisement
Update:2022-08-14 18:28 IST

దిగ్గజ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఇవాళ ఉదయం అనారోగ్యంతో ముంబైలో చనిపోయిన విషయం తెలిసిందే. రూ. 5వేల ఇన్‌న్వెస్ట్‌మెంట్‌తో మొదలు పెట్టి వేల కోట్ల రూపాయలు అర్జించిన వ్యక్తిగా ఆయనకు ఎంతో పేరుంది. కేవలం తాను పెట్టుబడి పెట్టడమే కాకుండా తనతో పాటు ఎంతో మందిని స్టాక్ మార్కెట్ వైపు మళ్లించి లాభాలు తెచ్చిపెట్టారు. చిన్న మదుపుదారులు రాకేశ్ ఇచ్చే సలహాలు, సూచనలు పాటించి లాభాలు తెచ్చుకునేవాళ్లు. అప్పట్లో పత్రికలు, మ్యాగజైన్స్‌లో రాకేశ్ సలహాలు ఇచ్చేవారు. అయితే రాకేశ్‌కు ఒక నకిలీ కూడా తయారయ్యాడు. అయితే అతడి వల్ల ఎవరికీ అపాయం, నష్టం కలగలేదు. కానీ అతడి రాతలు చదివి మాత్రం నవ్వుకునేవారు.

ఇంటర్నెట్ అప్పుడే ఇండియాలోని అన్ని ప్రాంతాలకు చేరువ అవుతోంది. బ్లాగింగ్ అనేది 2005 తర్వాత ఊపందుకుంది. 2010 తర్వాత ట్విట్టర్, ఫేస్‌బుక్ కూడా విస్తృతంగా మారిపోయాయి. ఆ సమయంలో 'ది సీక్రెట్ జర్నల్ ఆఫ్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా' పేరుతో ఒక బ్లాగ్ నడిచేది. ఆ బ్లాగ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించిన విషయాలు పెద్దగా లేకపోయినా.. భారత జీవిన విధానం, పాలిటిక్స్, వ్యాపారంపై సెటైర్లు ఉంటేవి. ఝున్‌ఝున్‌వాలానే స్వయంగా ఈ బ్లాగ్ హాస్యం కోసం నడుపుతున్నాడని చాలా మంది భావించారు. ఆ సైట్‌లో వచ్చే రాతలు చాలా హాస్యం పండించేవి. అదే సమయంలో అప్పుడప్పుడు విమర్శలు కూడా ఎదుర్కునేవి. ఒకానొక సమయంలో ఆ బ్లాగ్‌కు నాకు సంబంధం లేదని కూడా రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా స్పష్టం చేశారు. అయినా సరే ఆ బ్లాగ్ పాపులారిటీ మాత్రం తగ్గలేదు.

ఆ బ్లాగ్ గురించి విస్తృతంగా చర్చ జరుగుతుండటంతో అసలు ఎవరా వ్యక్తి అని చాలా మంది ఆరా తీశారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ కూడా ఈ నకిలీ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఎవరు? అంటూ 2010లో ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ తర్వాత కూడా రెండేళ్ల పాటు ఆ బ్లాగ్‌తో పాటు ట్విట్టర్ పేజి కొనసాగింది. చివరకు హిందుస్తాన్ టైమ్స్ పత్రిక 2012 జూన్ 7న ఆ బ్లాగ్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరో ఫ్రంట్ పేజీలో ప్రచురించింది. అతడే ఆదిత్య మగల్. ఇందులో విశేషం ఏంటంటే ఆదిత్య మగల్ స్వయంగా హిందుస్తాన్ టైమ్స్‌లో కాలమిస్ట్‌గా పని చేస్తుండటం. వాళ్ల సండే అనుబంధం హెచ్‌టీ బ్రంచ్ అనే మ్యాగజైన్‌లో కాలమ్స్ రాస్తుండేవాడు. అప్పటికి ఆదిత్య వయసు 27 ఏళ్లు. నాలుగేళ్లుగా తన పేరు బయట పెట్టకుండానే ఆదిత్య మగల్ ఇలా సీక్రెట్‌గా రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా బ్లాగ్‌ను నడిపాడు.

ఆదిత్య మగల్.. ది ఎకనామిక్ టైమ్స్, అవుట్ లుక్ మ్యాగజైన్, జామ్ వంటి పత్రికలకు రాసేవాడు. ఆదిత్య రాసిన 'హౌ టు బికమ్ ఏ బిలియనీర్ బై సెల్లింగ్ నథింగ్' అనే నవలను ప్రముఖ పబ్లిషింగ్ సంస్థ పెంగ్విన్ ప్రచురించింది. ప్రస్తుతం ఆదిత్య బెంగళూర్ మిర్రర్ కోసం పని చేస్తున్నాడు. అయితే, ఏ రోజైతే హిందుస్తాన్ టైమ్స్.. ఆ నకిలీ ఝున్‌ఝున్‌వాలా వెనుక ఉన్న వ్యక్తి గురించి ఆర్టికల్ రాసిందో.. ఆ రోజు ఉదయమే ఆదిత్య మగల్ స్వయంగా ఝున్‌ఝున్‌వాలాను కలిశాడు. ఆ సమయంలో వారిద్దరి మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణను కూడా ప్రచురించింది.

ముంబై నారీమన్ పాయింట్‌లో ఉన్న ఝున్‌ఝున్‌వాలా కార్యాలయం రేర్ ఎంటర్‌ప్రైజెస్‌కు ఆదిత్య వెళ్లాడు. రిసెప్షన్‌లో తాను వచ్చిన విషయం చెప్పగానే ఝున్‌ఝున్‌వాలా స్వయంగా తన ప్రైవేట్ ఆఫీస్‌కు తీసుకొని వెళ్లాడు. అక్కడ తనను తాను ఆదిత్య పరిచయం చేసుకున్నాడు. అయితే ఝున్‌ఝున్‌వాలా మాత్రం.. నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని ప్రశ్నిచాడు. నాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు సార్ అని ఆదిత్య బదులిచ్చాడు. ఎందుకు లేరు? నీ వయసులో ఉన్నప్పుడు నేను అమ్మాయిల విషయంలో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండేవాడినని ఝున్‌ఝున్‌వాలా చెప్పారు. అదేం లేదు సార్.. నా వయసులో ఉండగా.. మీరు రూ.5000తో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఉన్నారని ఆదిత్య అన్నాడు.

అయితే నీకు అమ్మాయిలు కాకుండా అబ్బాయిలంటే ఇష్టమా అని ఝున్‌ఝున్‌వాలా ప్రశ్నించడంతో ఆదిత్య కంగారు పడ్డాడు. అది కాదు సార్, అసలు గర్ల్ ఫ్రెండ్ గురించి ఎందుకు అడుగుతున్నారు అని ఆదిత్య ప్రశ్నించాడు. అప్పుడు ఝున్‌ఝున్‌వాలా సుదీర్ఘంగా ఊపిరి తీసుకొని.. నువ్వు ఆడవాళ్ల మనసును కచ్చితంగా తెలుసుకోగలిగితే.. జీవితం, మార్కెట్ అంటే ఏంటో పూర్తిగా అర్థం అవుతుందని చెప్పాడు. ఈ చర్చను అంతా ఎకనామిక్ టైమ్స్ తర్వాత రోజు ప్రచురించింది.

అయితే రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాను కలవడానికి వచ్చింది 'నకిలీ ఝున్‌ఝున్‌వాలా' అని తెలుసుకొని కార్యాలయంలోని ఇన్వెస్టర్లు, ఉద్యోగులు అందరూ పరుగెత్తుకొని వచ్చారు. అతడికి షేక్ హ్యాండ్స్ ఇవ్వడమే కాకుండా మీ ఫ్యాన్స్ సార్ మేము అని ఆదిత్యతో చెప్పారు. అది చూసి పక్కనే ఉన్న అసలైన ఝున్‌ఝున్‌వాలా కూడా ఆశ్చర్యపోయాడు. ఏదేమైనా తనలో లేని హాస్యాన్ని తన పేరుతో ప్రచారం చేసినందుకు మెచ్చుకున్నాడు. ఆదిత్య తర్వాత ఝున్‌ఝున్‌వాలా సలహాతో ఎన్నో స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేశాడు. ప్రస్తుతం కాలమిస్ట్‌గా కొనసాగుతున్నా.. స్టాక్ మార్కెట్ ద్వారా బాగానే సంపాదించినట్లు చెప్పాడు.

Tags:    
Advertisement

Similar News