కొత్త సీఈసీ ఎంపిక వాయిదా వేయాలని కాంగ్రెస్ డిమాండ్
కొత్త ఎన్నికల ప్రధాన అధికారి ఎంపిక కోసం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
ప్రధాని మోదీ అధ్యక్షతన కొత్త ఎన్నికల ప్రధాన అధికారి ఎంపిక కోసం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ప్రస్తుత ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ పదవీకాలం రేపటితో ముగియనున్న విషయం తెలిసిందే. అయితే, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎంపిక వాయిదా వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు అభిషేక్ సింఘ్వి, అజయ్ మాకెన్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఈసీ నియామకం అంశంపై సుప్రీంకోర్టులో ఈ నెల 19న విచారణ జరుగుతుందని.. ఈ క్రమంలో భేటీని వాయిదా వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
వాస్తవానికి గతేడాది ప్రధాని ఆథ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం సీఈసీ, ఈసీల నియామకానికి కొత్త చట్టం పార్లమెంట్‌లో తీసుకువచ్చి ఆమోదించింది. ప్రధాన ఎన్నికల అధికారి, ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సైతం సభ్యుడిగా ఉండగా.. ఆయన స్థానంలో కేంద్ర న్యాయశాఖ మంత్రికి అవకాశం కల్పిస్తూ చట్టాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.