టిష్యూ పేపర్‌లో బాంబు హెచ్చరిక.. విమానంలో కలకలం

పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు, భద్రతా సిబ్బంది విమానంలో తనిఖీలు చేపట్టారు.

Advertisement
Update:2024-05-17 13:20 IST

ప్రయాణికులందరూ ఆ విమానంలో ఎక్కి కూర్చున్నారు. మరికాసేపట్లో విమానం టేకాఫ్ కావాల్సి ఉంది. ఇంతలో విమానంలో బాంబు ఉందన్న ప్రచారం మొదలైంది. దీంతో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది భయంతో హడలిపోయారు. సిబ్బంది ఉన్నపళంగా ప్రయాణికులందరినీ విమానం నుంచి దించేశారు. ఈ సంఘటన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది.

ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి గుజరాత్ రాష్ట్రం వడోదరకు వెళ్లేందుకు ఎయిర్ ఇండియాకు చెందిన విమానం సిద్ధంగా ఉంది. మరికాసేపట్లో టేకాఫ్ కావాల్సి ఉండగా విమానంలోని వాష్ రూమ్‌లో 'బాంబ్' అని రాసి ఉన్న ఓ టిష్యూ పేపర్ సిబ్బందికి కనిపించింది. దీంతో భయాందోళనకు గురైన సిబ్బంది వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేశారు. విమానం నుంచి వారిని వెంటనే కిందకు దింపేశారు.

అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు, భద్రతా సిబ్బంది విమానంలో తనిఖీలు చేపట్టారు. అయితే విమానంలో ఎటువంటి పేలుడు పదార్థం, అనుమానిత వస్తువులు లభ్యం కాలేదు. ఇది ఆకతాయిల పని అయి ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు.

కాగా, ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది. విమానంలో బాంబు ఉందని టిష్యూ పేపర్‌లో రాసి ఉండటంతో ప్రయాణికులందరినీ సురక్షితమైన స్థానానికి చేర్చినట్లు పేర్కొంది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నించామని, వారికి వసతి సౌకర్యం కల్పించినట్లు చెప్పింది. అనంతరం ప్రయాణికులందరినీ మరో ప్రత్యేక విమానంలో వడోదరకు చేర్చిన‌ట్లు ఎయిర్ ఇండియా ఆ ప్రకటనలో పేర్కొంది.

Tags:    
Advertisement

Similar News