వివిధ‌ రాష్ట్రాల్లో ‘అజిత్‌ పవార్‌’ల కోసం బీజేపీ వ్యూహం

తనకు ముఖ్యమంత్రి పదవి కావాలని అజిత్‌ పవార్‌ కోరుకోవ‌డం తప్పు కాదు. కానీ అందుకు అడ్డదారులు తొక్కడం, పార్టీని అక్రమంగా తన చెప్పుచేతల్లోకి తీసుకోవ‌డం కుటిల వ్యూహం. ఈ దుస్సాహసం కాషాయ పరివారపు దుష్టపన్నాగాల వల్లనే అజిత్‌కు సాధ్యమైంది.

Advertisement
Update:2023-07-06 19:34 IST

‘‘ఎవరి నుంచి దొంగిలించామో వారిని క్షమించడం కష్టం’’ అంటాడు చలం శ్రీశ్రీ కవిత్వానికి రాసిన ముందుమాటలో. సాహిత్యం విషయంలోనే కాదు రాజకీయాల్లోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. తన బాబాయి శరద్‌పవార్‌ ఆశీస్సులతో, ప్రోత్సాహంతో రాజకీయాల్లో ఎదిగివచ్చిన అజిత్‌ పవార్ ఇప్పుడు ఆయనకు ఎదురు తిరగడమే కాదు, ఆయన రాజకీయాల్లోంచి తప్పుకోవాలని ఆశిస్తున్నారు. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి)ని స్థాపించిన శరద్‌పవార్‌కు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిపే హక్కు లేదంటున్నాడు అజిత్‌పవార్‌. గురువారం ఢిల్లీలో శరద్‌పవార్‌ ఏర్పాటు చేసిన సమావేశం చట్టసమ్మతం కాదని, అసలైన ఎన్‌సిపి తనదేనని తెగేసి చెబుతున్నాడు.

మహారాష్ట్రలో శరద్‌పవార్‌ ఎన్‌సిపిని ఏర్పాటు చేయకపోతే అజిత్‌ పవార్‌కు రాజకీయ భవిష్యత్తు వుండకపోయేది. కానీ, ఇప్పుడు 82 ఏళ్ల‌ కురువృద్ధ నేత శరద్‌ పవార్‌ ఇక రాజకీయాలు చాలించాలని, పార్టీ పగ్గాలు చేపట్టడం తన హక్కు అన్నట్టుగా మాట్లాడటం విడ్డూరం కాదు విషమ వాస్తవం.

తనకు ముఖ్యమంత్రి పదవి కావాలని అజిత్‌ పవార్‌ కోరుకోవ‌డం తప్పు కాదు. కానీ అందుకు అడ్డదారులు తొక్కడం, పార్టీని అక్రమంగా తన చెప్పుచేతల్లోకి తీసుకోవ‌డం కుటిల వ్యూహం. ఈ దుస్సాహసం కాషాయ పరివారపు దుష్టపన్నాగాల వల్లనే అజిత్‌కు సాధ్యమైంది. ముఖ్యమంత్రి పదవి కావాలంటే పార్టీకి మెజారిటీ సీట్లు సాధించేందుకు శ్రమించాలి. పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవాలి. జనం ఆదరణతో తిరుగులేని నాయకునిగా ఎదగాలి. శరద్‌పవార్‌ ఎదుగుదల ఒక్కరాత్రితో జరిగింది కాదు, క్రమక్రమంగా ఆయన ఎదిగివచ్చారు. వ్యూహ ప్రతివ్యూహాల్ని అనుసరించకపోలేదు. కానీ, కొన్ని సూత్రాలకు కట్టుబడ్డారు. ఇవన్నీ అజిత్‌ పవార్‌కు తెలియనివి కాదు. కానీ అడ్డదారుల్లోనైనా అధికారం పొందాలన్న అతని యావని బీజేపీ గమనించింది. వారు వేసిన పాచికలో పడిపోయిన అజిత్‌ పవార్‌ పార్టీ వ్యవస్థాపకుడైన శరద్‌పవార్‌ను పార్టీ నుంచి తరిమేసేందుకు తెగబడ్డాడు

(ఈ సందర్భంగా రెండు దశాబ్దాల కిందట తెలుగునాట తెలుగుదేశం వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్‌ని అల్లుడైన చంద్రబాబు టీడీపీ నుంచి గెంటి వేసిన ఉదంతం ఎవరికయినా గుర్తుకు రావొచ్చు).

సరిగ్గా అనేక రాష్ట్రాల్లో ఇలాంటి ‘అజిత్‌ పవార్‌’ల కోసం బీజేపీ ఎదురుచూస్తున్నది. మహారాష్ట్రలోనే ఎన్‌సిపి చీలిక ఉదంతం పూర్తయ్యాక అక్కడి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకునే పథకాలు రచిస్తుందనే వార్తలు ఇప్పటికే గుప్పుమన్నాయి. కొన్నాళ్ల‌ కిందట బీహార్‌లో నితీష్‌కుమార్‌ పార్టీ జనతాదళ్‌(యు)లో చీలిక కోసం మొదలు పెట్టిన ‘ఆపరేషన్‌’ విఫలమైంది. ఇప్పుడు మరలా మరో ప్రయత్నం చేస్తున్నారు. బీహార్‌లో వారికి ఓ ‘అజిత్‌ పవార్‌’ కావాలి. లాలూ ప్రసాద్‌ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్‌ మీద కూడా వారి చూపు పడింది. ఆ పార్టీని ఇబ్బంది పెట్టేందుకు లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్‌ మీద కేసుల విచారణను తీవ్రతరం చేసింది.

కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షాల ఐక్యత కోసం ప్రయత్నిస్తుండగా విభిన్న పార్టీలలో చీలికలు తెచ్చి లబ్ది పొందేందుకు బీజేపీ పరివారం కుటిల వ్యూహాలు రచిస్తున్నది. ఎక్కడ ఏ రాష్ట్రంలో తమకు ‘అజిత్‌ పవార్‌’ వంటి నేతలు దొరికే అవకాశం వుందో చూస్తున్నారు. అన్నిరకాలుగా ప్రలోభాలకు లోను చేసే కుతంత్రాలు నడుస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ మరింత అప్రమత్తం కావాల్సి వుంది. రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌కు, సచిన్‌ పైలెట్‌కు మధ్య ఇంకా రాజీ కుదరలేదు. 6 నెల‌ల్లో రాజస్థాన్‌ అసెంబ్లీకి జరగబోయే ఎన్నికలు కాంగ్రెస్‌కు కీలకం. అక్కడ విభేదాలు మరచి ఐక్యంగా కలిసి పనిచేస్తేనే గెలుపు అవకాశాలు ఉంటాయి. అయితే ఆ ఇద్దరి మధ్య విభేదాలతో లబ్ది పొందడానికి కాషాయ పరివారం ప్రయత్నించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అనే తేడా లేకుండా వివిధ పార్టీలలోని అసంతృప్తుల మీద దృష్టి పెట్టిన బీజేపీ పెద్దలు ఆయా రాష్ట్రాలలో ‘అజిత్‌ పవార్‌’ వంటి వారి కోసం గాలం వేసి వుంచినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల పరంపరలో ప్రతిపక్షాలు ఐక్యం కావడం ఒక సవాల్‌గా పరిణమిస్తే, తమ పార్టీల నుంచి ఎవరూ జారిపోకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఆయా పార్టీలలో నెలకొన్నది. ప్రజాస్వామ్యం తమ రక్తంలోనే వుందని ప్రధాని నరేంద్ర మోదీ వైట్‌హౌస్‌లో ఘనంగా చెప్పుకున్నారు. కానీ, ఇక్కడి పార్టీలను చీలికలు పేలికలు చేసే కాషాయ తంత్రం మన ప్రజాస్వామ్య వ్యవస్థకు శోభనిస్తుందా అన్నదే అసలు ప్రశ్న.

Tags:    
Advertisement

Similar News