సంతకం తెచ్చిన తంటా.. బీజేపీ అభ్యర్థికి విజయం

బీజేపీ అభ్యర్థి మినహా మిగిలిన అభ్యర్థులందరూ తమ నామినేషన్‌ పత్రాలను ఉపసంహరించుకున్నారు. దీంతో ఆ నియోజకవర్గ ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థి ముఖేష్‌ దలాల్‌ మాత్రమే మిగిలారు.

Advertisement
Update:2024-04-22 16:57 IST

ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో విచిత్రం చోటుచేసుకుంది. గుజరాత్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి అనూహ్య విజయం సాధించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. గుజరాత్‌లోని సూరత్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ముఖేష్‌ దలాల్‌ పోటీ చేస్తున్నారు. ఆయన నామినేషన్‌ కూడా దాఖలు చేశారు.

ఇక ఈ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా నీలేష్‌ కుంభానీ నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే అధికారులు తనిఖీలో భాగంగా ఆయన నామినేషన్‌ పత్రాలను తిరస్కరించారు. అందుకు కారణం.. ఆయన నామినేషన్‌ పత్రాలపై చేసిన సంతకంలో వ్యత్యాసం ఉందట. దీంతో అక్కడి జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు.

అంతేకాదు.. బీజేపీ అభ్యర్థి మినహా మిగిలిన అభ్యర్థులందరూ తమ నామినేషన్‌ పత్రాలను ఉపసంహరించుకున్నారు. దీంతో ఆ నియోజకవర్గ ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థి ముఖేష్‌ దలాల్‌ మాత్రమే మిగిలారు. దీంతో ఆయన పోటీయే లేకుండా ఏకగ్రీవంగా గెలుపొందారు. ఎన్నికల ఫలితాలు వెలువడకముందే గుజరాత్‌లో బీజేపీ బోణీ కొట్టడం గమనార్హం.

గుజరాత్‌లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీ పొత్తు పెట్టుకున్నాయి. అక్కడ మొత్తం 26 లోక్‌సభ స్థానాలు ఉండగా, పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ 24 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించింది. ఇక ఆప్‌ భావనగర్, భరూచ్‌ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను పోటీకి నిలిపింది.

Tags:    
Advertisement

Similar News