కంటెంట్ తో కలవరం.. జియో ఆధిపత్యానికి బ్రేక్ అవసరం..

కేవలం తమ చందాదారులకు మాత్రమే కంటెంట్ అందుబాటులో ఉంచుతూ రిలయన్స్ జియో వంటి సంస్థలు ఓ పద్ధతి ప్రకారం వినియోగదారుల్ని ఆకట్టుకుంటున్నాయి.

Advertisement
Update:2022-07-17 11:49 IST

ఓటీటీ, డిజిటల్ ప్లాట్ ఫామ్ ల జోరుతో రిలయన్స్ జియో వంటి సంస్థల గుత్తాధిపత్యం పెరిగిపోతుందని భారతి టెలిమీడియా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఓటీటీ, డిజిటల్ ప్లాట్ ఫామ్ లు ట్రాయ్ నిబంధనలకు లోబడి పనిచేయడం లేదు. వాటికోసం ప్రత్యేక నిబంధనలు తయారు చేయాల్సిన అవసరం ఉందని ఇప్పటికే నిపుణులు సూచిస్తున్నారు. అయితే ట్రాయ్ నిబంధనలు లేకపోవడంతో రిలయన్స్ జియో వంటి సంస్థలు, వాటికి అనుసంధానంగా ఉన్న ఓటీటీ, డిజిటల్ ప్లాట్ ఫామ్ ల కంటెంట్ తో వినియోగదారుల్ని ఆకర్షిస్తున్నాయి.

ఉదాహరణకు నిన్న మొన్నటి వరకూ ఈటీవీ సీరియల్స్ యూట్యూబ్ లో వచ్చేవి, కానీ వాటిని ఇప్పుడు కేవలం జియో టీవీలో మాత్రమే ప్రసారం చేస్తున్నారు. అంటే జియో కస్టమర్ అయితేనే ఈటీవీ సీరియల్స్ ని మొబైల్ లో చూసే అవకాశం ఉంది. దీంతో చాలామంది ఎయిర్ టెల్ కస్టమర్లు, జియోకి మారిపోతున్నారు. అంటే ఇక్కడ రిలయన్స్ జియోకి సొంత మీడియా సంస్థలు, లేదా మీడియా సంస్థల్లో భాగస్వామ్యం ఉండటం వల్ల ఈ రకమైన గుత్తాధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇలాంటి వాటికి ట్రాయ్ చెక్ పెట్టాలంటోంది భారతి టెలిమీడియా.

ఇంటర్‌ కనెక్ట్ రెగ్యులేషన్ ప్రకారం, ప్రసార కర్తలు తప్పనిసరిగా లైవ్ టీవీని కేబుల్, DTH, MSO ఆపరేటర్లలకు ఎలాంటి వివక్షత లేకుండా అందించాలి. అయితే ఇక్కడ ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు మాత్రం ఆ రూల్ వర్తించదు. అందుకే రిలయన్స్ జియో వంటి సంస్థలు తెలివిగా తమ ప్రణాళికను అమలులో పెట్టాయి. కేవలం తమ చందాదారులకు మాత్రమే కంటెంట్ అందుబాటులో ఉంచుతూ రిలయన్స్ జియో వంటి సంస్థలు ఓ పద్ధతి ప్రకారం వినియోగదారుల్ని ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఇప్పటికే టెలికం రంగంలో గుత్తాధిపత్య ధోరణి మొదలైంది. అయితే వీలైనంత త్వరగా దీనికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు భారతి టెలిమీడియా నిర్వాహకులు.

నెట్ న్యూట్రాలిటీ నిబంధనలకు ఇది విరుద్ధం కాకపోయినా మున్ముందు ఇలాంటి విధానాలతో వినాశనం తప్పదని, ఓటీటీ, డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ని అడ్డు పెట్టుకుని టెలికం రంగంలో గుత్తాధిపత్యానికి రిలయన్స్ జియో వంటి సంస్థలు ప్రయత్నిస్తాయనే ఆరోపణలు ఎక్కువవుతున్నాయి. అయితే రిలయన్స్ లాంటి కంపెనీకి కేంద్రం అండదండలు ఉన్నంత కాలం ట్రాయ్ ఆ దిశగా నియంత్రణవైపు అడుగులు వేస్తుందనుకోవడం భ్రమే అవుతుంది.

Tags:    
Advertisement

Similar News