మోదీ వర్సెస్ బీబీసీ.. డాక్యుమెంటరీ రగడ
2002లో జరిగిన గోద్రా అనంతర అల్లర్లలో మోదీ పాత్ర, ఆ దుర్ఘటనల్లో చనిపోయిన మైనార్టీలు, వారి కుటుంబాలపై పరిశోధనాత్మక కథనాలు ప్రసారం చేశామని బీబీసీ ఆ డాక్యుమెంటరీకి వివరణ ఇస్తోంది.
భారత ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ ఇప్పుడు సంచలనంగా మారింది. "ఇండియా: మోడీ క్వశ్చన్" అనే పేరుతో రెండు భాగాలుగా ఈ డాక్యుమెంటరీ ప్రసారమైంది. సహజంగా మోదీకి బాకా ఊదితే మన నాయకులకు రుచించేది. కానీ ఆ డాక్యుమెంటరీ మోదీ తప్పొప్పులను ఎత్తి చూపడంతో భక్తులంతా విమర్శలతో విరుచుకుపడుతున్నారు. బీబీసీ తప్పుడు కథనాలు ప్రసారం చేసిందని, పక్షపాతంతో మోదీపై నిందలు మోపిందని అంటున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఈ కథనాలపై మండిపడ్డారు. వలసవాద భావజాలాన్ని ఈ కథనాలు మోసుకొచ్చాయని విమర్శించారాయన. భారతీయ మూలాలున్న బ్రిటన్ పౌరుడు లార్డ్ రమి రేంజర్ కూడా ఈ కథనంపై మండిపడ్డారు. 100 కోట్ల మందికిపైగా ఉన్న భారతీయుల మనసును బీబీసీ తీవ్రంగా గాయపరిచిందన్నారు.
ఇంతకీ డాక్యుమెంటరీలో ఏముంది..?
2002లో జరిగిన గోద్రా అనంతర అల్లర్లలో మోదీ పాత్ర, ఆ దుర్ఘటనల్లో చనిపోయిన మైనార్టీలు, వారి కుటుంబాలపై పరిశోధనాత్మక కథనాలు ప్రసారం చేశామని బీబీసీ ఆ డాక్యుమెంటరీకి వివరణ ఇస్తోంది. అయితే ఈ కేసులో మోదీకి కోర్టు కూడా క్లీన్ చిట్ ఇచ్చిందని, ఇప్పుడు బీబీసీ ఎలాంటి పరిశోధన చేస్తోందని మండిపడుతున్నారు భక్తులు. మోదీకి మద్దతుగా సోషల్ మీడియాలో బీబీసీని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
భారత్ లో మైనార్టీలపై జరుగుతున్న దాడులు, 2019లో మోదీ రెండోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత తీసుకున్న సంచలన నిర్ణయాలు, కాశ్మీర్ ప్రత్యేక హోదా తొలగింపు తదనంతర పరిణామాలపై "ఇండియా: మోడీ క్వశ్చన్" అనే డాక్యుమెంటరీ రూపొందింది. ఈ డాక్యుమెంటరీ భారత్ లో ఇంకా ప్రసారం కాలేదు. అయితే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో అందుబాటులో ఉన్న ఈ డాక్యుమెంటరీ సంచలనంగా మారింది. దీంతో కొన్నిచోట్ల దీనిని తొలగించారు. అయితే బీబీసీ డాక్యుమెంటరీపై నియంత్రణ ఎందుకని మరికొందరు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. మోదీ తప్పులు చెబుతుంటే ఉలిక్కిపడతారెందుకని ట్వీట్లు చేస్తున్నారు. మొత్తమ్మీద బీబీసీ డాక్యుమెంటరీపై జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది.