ఇద్దరు శాంటాక్లాజ్‌లపై దాడి.. కార్నివాల్ ను అడ్డుకున్న భజరంగ్‌ దళ్ కార్యకర్తలు

గుజరాత్‌లోని అహ్మదాబాద్ లో వారంరోజుల పాటు క్రిస్టియన్స్ కార్నివాల్ జరుగుతుంది. శుక్రవారం రాత్రి ఈ కార్నివాల్ లో శాంటా క్లజ్ వేషధారణలో ఉన్న‌ ఇద్దరు వ్యక్తులు మత ప్రచారం చేస్తున్నారంటూ భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు.

Advertisement
Update:2022-12-31 18:01 IST

క్రిస్టియన్లు డిశంబర్ చివరి వారంలో జరుపుకునే కార్నివాల్ పై భజరంగ్ దళ్ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. ఇద్దరు శాంటా క్లాజ్ లపై దాడి చేసి తరిమి తరిమి కొట్టారు

గుజరాత్‌లోని అహ్మదాబాద్ లో వారంరోజుల పాటు క్రిస్టియన్స్ కార్నివాల్ జరుగుతుంది. శుక్రవారం రాత్రి ఈ కార్నివాల్ లో శాంటా క్లజ్ వేషధారణలో ఉన్న‌ ఇద్దరు వ్యక్తులు మత ప్రచారం చేస్తున్నారంటూ భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. వారు   వేసుకున్న శాంటా క్లజ్ డ్రస్సులే కాక వాళ్ళు లోపలేసుకున్న చొక్కాలు కూడా చిరిగిపోయాయి. ఇద్దరూ పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు.

శాంతాక్లాజ్‌ని వెంబడించి కొట్టిన వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో బజరంగ్ దళ్ కార్యకర్తలు ''చర్చికి వెళ్లి మీ మతాన్ని ప్రచారం చేసుకోండి. ఇక్కడ మీరు మైండ్ వాష్ చేస్తే ఊరుకోం.'' అని హెచ్చరిస్తున్న మాటలు వినిపించాయి. దీనిపై బజరంగ్ దళ్ నాయకుడు జ్వాలిత్ మెహతా మాట్లాడుతూ ఇక్కడ వారు శాంతాక్లాజ్ దుస్తులలో క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసే పుస్తకాలను విక్రయిస్తున్నారని చెప్పారు. విషయం తెలియడంతో అతనిపై ఈ చర్య తీసుకున్నామన్నారు. కార్నివాల్‌లో మతమార్పిడిలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ భజరంగ్‌ దళ్ కార్యకర్తలు కార్నివాల్‌ను నిలిపివేయించారు.

గత నాలుగు రోజులుగా కార్నివాల్‌లో క్రైస్తవ మతానికి సంబంధించిన పుస్తకాలను క్రైస్తవ మిషనరీలు విక్రయిస్తున్నారని విశ్వహిందూ పరిషత్ అధికార ప్రతినిధి హితేంద్రసింగ్ రాజ్‌పుత్ ఆరోపించారు. ''శాంతా వేషధారణలో ఉన్న కొందరు వ్యక్తులు క్రైస్తవ మతాన్ని ప్రచారం చేస్తూ మతమార్పిడి కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారు. దీనిపై విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌లకు సమాచారం అందింది. విచారణ చేయగా అది నిజమని తేలింది. దీంతో బజరంగ్‌దళ్‌ ప్రాంతీయ అధ్యక్షుడు జ్వాలిత్‌భాయ్‌ మెహతా ఆధ్వర్యంలో 20 మంది కార్యకర్తలు కార్నివాల్‌లో జరుగుతున్న మతమార్పిడి కార్యకలాపాలను నిలిపివేశారు.'' అని హితేంద్రసింగ్ రాజ్‌పుత్ అన్నారు.

కంకారియా కార్నివాల్ అనేది డిసెంబర్ చివరి వారంలో జరిగే వారం రోజుల పండుగ. కార్నివాల్ సందర్భంగా అనేక సాంస్కృతిక, కళా, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ పండుగను ఆస్వాదించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు.

క్రిస్మస్‌ పండుగ తర్వాత ఇలా కార్నివాల్ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని, మత మార్పిడి అంటూ శాంటాలపై దాడి చేయడం దుర్మార్గమని పలువురు క్రిస్టియన్లు విమర్శిస్తున్నారు.

బీజేపీ పరిపాలిస్తున్న గుజరాత్ లో ఎవరిపైనైనా దాడులు చేసే అధికారం భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలకు కట్టబెట్టారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అసలు అక్కడ పోలీసు వ్యవస్థ ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News