'ఇది హిందూ దేశం, ఇక మౌల్వీలు మూటా ముల్లె సర్దుకోవాలి...': VHP హెచ్చ‌రిక‌

ఇది హిందూ దేశం మౌల్వీలందరూ మూటా ముల్లె సర్దుకొని వెళ్ళిపోవాలి అని విశ్వహిందూ పరిషత్ హెచ్చరించింది. ముస్లింలు ల్యాండ్ జిహాద్ కు పాల్పడుతున్నారని విహెచ్ పి ఆరోపించింది.

Advertisement
Update:2022-10-17 13:05 IST

గుర్గావ్‌లోని భోరా కలాన్ గ్రామంలో ముస్లిం స‌మాజం ల్యాండ్ జిహాద్ కు పాల్ప‌డుతోంద‌ని ఆరోపిస్తూ విశ్వహిందూ పరిషత్ (విహెచ్ పి) ఇటీవల మానేసర్‌లో నిర్వ‌హించిన స‌భ వివాదాస్పదంగా మారింది.


భోరా కలాన్ గ్రామంలోని ఒక మసీదులో భూ ఆక్ర‌మ‌ణ‌ల‌కు కుట్ర జ‌రుగుతోంద‌ని విహెచ్ పి జాయింట్ జనరల్ సెక్రటరీ సురేంద్ర జైన్ ఆరోపించారు. ఆ ప్రాంతంలో ముస్లింలు బలవంతంగా భూమిని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని జైన్ అన్నారు. ముస్లింలు 'ల్యాండ్ జిహాద్' కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు. త‌క్ష‌ణ‌మే మౌల్వీలందరూ మూటా ముల్లె స‌ర్దుకోవాల‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.


మనేసర్‌లో వీహెచ్‌పీ నిర్వహించిన 'త్రిశూల్ దీక్ష' కార్యక్రమంలో జైన్ ప్ర‌సంగిస్తూ.. భోరా కలాన్ గ్రామంలో ముస్లింలు అక్రమంగా భూమిని కబ్జా చేశారని పేర్కొన్నారు. "12-13 సంవత్సరాల క్రితం, కేవలం మూడు ముస్లిం కుటుంబాలు మాత్రమే భోరా కలాన్‌కు వచ్చి మేకలను మేపడానికి ఉద్దేశించిన భూమిలో నమాజ్ చేయడానికి అనుమతిని కోరాయి. కానీ బయటనుంచి ఏ మౌల్వీకానీ ఇత‌రులు కానీ వ‌చ్చేందుకు వీలు లేద‌ని ఒప్పందం కుదిరింది. కానీ క్ర‌మంగా బ‌య‌టి వ్య‌క్తులు రావ‌డం ప్రారంభ‌మైంది. నేడు వారు మ‌జీద్ నిర్మించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని జైన్ అన్నారు.


"మ‌న ఇంట్లోకి ఎవ‌రైనా చొర‌బ‌డి మ‌సీదు నిర్మిస్తామంటే ఒప్పుకుంటామా ?... భోరా కలాన్‌లో జరిగినది రేపు గుర్గావ్, మనేసర్, హర్యానా, దేశంలో ఎక్క‌డైనా జరగవచ్చు. వారు మొత్తం దేశాన్ని మార్చాలని అనుకుంటున్నారు.. వారికి గుణపాఠం చెప్పిన భోరా కలాన్ ప్రజలను నేను అభినందిస్తున్నాను అన్నారు.

"నేను ఆ మౌల్వీలకు చెప్పాలనుకుంటున్నాను, మీ వస్తువులను సర్దుకోండి లేదా మానేసర్ ప్రజలు మిమ్మల్ని వదిలిపెట్టరు.. ఇది హిందూ దేశం .. ఇలాగే ఉంటుంది." అని జైన్ అన్నారు.


Tags:    
Advertisement

Similar News