ఆంజనేయుడు దేవుడు కాదు.. అందుకే పంచ్ డైలాగులు రాశా..
రచయిత తనను తాను సమర్థించుకునే ప్రయత్నాల్లో మరోసారి చిక్కుల్లో పడ్డారు. హనుమంతుడికి పంచ్ డైలాగులు ఎందుకు రాయాల్సి వచ్చిందో చెప్పే క్రమంలో ఆయన అసలు దేవుడే కాదంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు.
ఆదిపురుష్ సినిమా దర్శకుడు, మాటల రచయిత.. బయట కనపడితే ఉతికి ఆరేస్తామంటూ హెచ్చరికలు వినపడుతున్న వేళ.. ఆ వివాదాలను మరింత పెద్దది చేయడానికే వారు ఉబలాటపడుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఆదిపురుష్ మాటల రచయిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు హనుమంతుడు దేవుడే కాదని, ఆయన కేవలం భక్తుడని.. మనమే ఆయనకు దైవత్వాన్ని ఆపాదించామని చెప్పుకొచ్చారు.
కవర్ చేసుకోడానికి పాట్లు..
ఆదిపురుష్ సినిమాలో హనుమంతుడు లంకకు వెళ్లినప్పుడు అక్కడ పంచ్ డైలాగులు చెప్పే సన్నివేశం ఒకటుంది. ఫక్తు ఫ్యాక్షన్ మూవీలో డైలాగులు చెప్పినట్టు హనుమంతుడితో ఆ మాటలు పలికించారు దర్శకుడు. రాముడు, సీత పాత్రల చిత్రీకరణపై వచ్చిన వివాదాలకంటే.. హనుమంతుడు పలికిన ఆ పంచ్ డైలాగులపైనే చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఇటీవల ఆదిపురుష్ సినిమాలో సంభాషణలు మారుస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. అయితే రచయిత మాత్రం తనను తాను సమర్థించుకునే ప్రయత్నాల్లో మరోసారి చిక్కుల్లో పడ్డారు. హనుమంతుడికి పంచ్ డైలాగులు ఎందుకు రాయాల్సి వచ్చిందో చెప్పే క్రమంలో ఆయన అసలు దేవుడే కాదంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు.
ఆదిపురుష్ మాటల రచయిత మనోజ్ ముంతాషిర్ శుక్లా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హనుమంతుడు భగవంతుడు కాదని, కేవలం భక్తుడని, ఆయన భక్తిలో ఉన్న శక్తి కారణంగా మనమే ఆయన్ను భగవంతుడిని చేశామంటున్నారు మనోజ్. తాజా వ్యాఖ్యలు మరింత దుమారం రేపగా నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మనోజ్ ఇకనైనా నోరుమూసుకుని ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. హనుమంతుడు దేవుడేనని, అనవసరంగా ప్రజల్ని రెచ్చగొట్టొద్దని మనోజ్ కి కౌంటర్లిస్తున్నారు.