బెడిసికొట్టిన కేజ్రీవాల్ థర్డ్ ఫ్రంట్ యత్నం
ఈ భేటీకి కేజ్రీవాల్ బీజేపీయేతర, కాంగ్రెసేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏడుగురికి లేఖలు రాశారు. మార్చి 18న ఢిల్లీకి రావాలని వారికి ఆహ్వానం పలికారు.
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. గత శనివారం ముఖ్యమంత్రులతో ఆయన ఏర్పాటు చేసిన విందు భేటీ విఫలమైంది. ఈ భేటీకి ఏడుగురు ముఖ్యమంత్రులను ఆహ్వానించగా, ఒక్కరు కూడా హాజరుకాకపోవడం గమనార్హం. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా ఆయన చేసిన ఈ ప్రయత్నం బెడిసికొట్టింది.
జాతీయ రాజకీయాల్లో పెద్దన్న పాత్ర పోషించాలని భావిస్తున్న కేజ్రీవాల్‌కు ఇది మింగుడుపడని అంశమే. తనతో కలిపి మొత్తం ఎనిమిది మంది ముఖ్యమంత్రుల భేటీకి చేసిన ప్లాన్ విఫలమవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ భేటీకి కేజ్రీవాల్ బీజేపీయేతర, కాంగ్రెసేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏడుగురికి లేఖలు రాశారు. మార్చి 18న ఢిల్లీకి రావాలని వారికి ఆహ్వానం పలికారు. 2024 లోక్‌సభ ఎన్నికల కూటమిపై చర్చించేందుకు ఆయన వారిని ఆహ్వానించారు. `ప్రోగ్రెసివ్ చీఫ్ మినిస్టర్స్ గ్రూప్ ఆఫ్ ఇండియా (జి-8) పేరుతో ఆయన ఈ కార్యక్రమం నిర్వహించాలని భావించారు.
కేజ్రీవాల్ ఫిబ్రవరి 5నే ఈ లేఖలు పంపించడం గమనార్హం. లేఖలు అందుకున్నవారిలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో పాటు మరికొంతమందికి పంపించారు. ఆహ్వానితుల్లో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఆరోగ్యం సరిగా లేదంటూ తిరస్కరించినట్టు సమాచారం. ఈ అంశంపై బీహార్, బెంగాల్ వర్గాలు కేజ్రీవాల్ ఆహ్వానాన్ని ధ్రువీకరించాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం ఈ అంశంపై ఇంకా స్పందించలేదు.