మధ్యప్రదేశ్‌లో నదిలో పడిన బస్సు.. 12 మంది మృతి

చనిపోయిన వారి మృతదేహాలను ఇప్పటికే నదిలోంచి బయటకు తీసుకొని వచ్చి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement
Update:2022-07-18 12:38 IST

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇండోర్ నుంచి పూణే వెళ్తున్న ఓ బస్సు ధార్ జిల్లా ఖాల్‌ఘాట్ సమీపంలోని సంజయ్ సేతు బ్రిడ్జి మీద నుంచి నర్మదా నదిలో పడిపోయింది. ఇండోర్ నుంచి 51 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి నదిలోకి జారి పడిపోయింది. కాగా, ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు మరణించారని, మరో 15 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించినట్లు మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు. మిగిలిన వారి కోసం అధికారులు సహాయక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. చనిపోయిన వారి మృతదేహాలను ఇప్పటికే నదిలోంచి బయటకు తీసుకొని వచ్చి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Delete Edit


మధ్యప్రదేశ్ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన బస్సు పూణే వెళ్తుండగా సోమవారం ఉదయం 10.45 గంటలకు ప్రమాదం జరిగింది. ఇప్పటికే క్రేన్ సహాయంతో బస్సును ఒడ్డుకు తీసుకొని వచ్చారు. బ్రిడ్జిమీద నుంచి రెయిలింగ్‌ను ఢీ కొట్టి 25 అడుగుల కింద ఉన్న నదిలో పడిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఇండోర్ కమిషనర్ పవన్ కుమార్ శర్మ, ధార్ కలెక్టర్ ప్రమాద స్థలానికి చేరుకొని గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

బస్సు ప్రమాదంపై మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ స్పందించారు. ప్రమాద స్థలానికి వెంటనే అధికారులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రమాద స్థలానికి వెళ్లి సహాయం చేయాలని సీఎం ఆదేశించారు. ఇక గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి మెరుగైన చికిత్స చేయిస్తున్నారు. ఈ ప్రమాదంపై మాజీ సీఎం కమల్‌నాథ్ కూడా విచారం వ్యక్తం చేశారు. యుద్ధ‌ ప్రాతిపదికన చర్యలు చేపట్టి.. బాధితులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Tags:    
Advertisement

Similar News