నిమోనియా త‌గ్గాల‌ని.. 3 నెలల ప‌సికందుకు 51 సార్లు వాత‌లు

చికిత్స పేరుతో ఆ ప‌సికందుకు ఇనుప రాడ్లు కాల్చి శ‌రీరంపై 51 సార్లు వాత‌లు పెట్టారు. ఈ నేప‌థ్యంలో పాప ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారింది. ఓవైపు కాలిన గాయాలు.. మ‌రోవైపు శ్వాస తీసుకోవ‌డం ఇబ్బందిగా మార‌డంతో అప్పుడు స్థానిక ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు.

Advertisement
Update:2023-02-04 13:05 IST

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో మూడు నెల‌ల ప‌సికందు మూఢ‌న‌మ్మ‌కానికి బ‌లైంది. గిరిజ‌న ప్రాబ‌ల్యం ఎక్కువ‌గా ఉన్న షాదోల్ జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. షాదోల్‌లోని సింగ్‌పుర్ క‌థౌటియా గ్రామానికి చెందిన మూడు నెల‌ల చిన్నారి రుచితా కోల్ నిమోనియా బారిన ప‌డింది. పాపకు శ్వాస తీసుకోవ‌డం ఇబ్బందిగా మార‌డంతో త‌ల్లిదండ్రులు ఆస్ప‌త్రికి తీసుకెళ్ల‌కుండా.. వారి మూఢ‌న‌మ్మ‌కంతో స్థానికంగా ఉండే మంత్ర‌గాళ్ల‌ వ‌ద్ద‌కు తీసుకెళ్లారు.

అక్క‌డ వాళ్లు చికిత్స పేరుతో ఆ ప‌సికందుకు ఇనుప రాడ్లు కాల్చి శ‌రీరంపై 51 సార్లు వాత‌లు పెట్టారు. ఈ నేప‌థ్యంలో పాప ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారింది. ఓవైపు కాలిన గాయాలు.. మ‌రోవైపు శ్వాస తీసుకోవ‌డం ఇబ్బందిగా మార‌డంతో అప్పుడు స్థానిక ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. అప్ప‌టికే 15 రోజులు గ‌డిచిపోయింది. నిమోనియాకు స‌రైన స‌మ‌యంలో చికిత్స అంద‌క‌పోవ‌డంతో ఇన్ఫెక్ష‌న్ వ‌చ్చి ఆ ప‌సికందు ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ చిన్నారి త‌ల్లిదండ్రులు హ‌డావుడిగా అంత్య‌క్రియ‌లు పూర్తిచేశారు.

మ‌హిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు శుక్ర‌వారం ఆ ఆస్ప‌త్రికి వెళ్ల‌గా ఈ విష‌యం వెలుగు చూసింది. దీంతో అధికారులు వెంట‌నే చ‌ర్య‌లు చేప‌ట్టారు. పాప మృత‌దేహాన్ని బ‌య‌టికి తీసి.. శ‌నివారం పోస్టుమార్టం చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

ఈ ఘ‌ట‌న‌పై షాదోల్ జిల్లా క‌లెక్ట‌ర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. గిరిజ‌న ప్రాబ‌ల్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి `చికిత్స`లు స‌ర్వ‌సాధార‌ణ‌మ‌య్యాయ‌ని ఆయ‌న చెప్పారు. దీనిపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. పాప‌కు వాత‌లు పెట్టొద్ద‌ని అంగ‌న్‌వాడీ టీచ‌ర్ చెప్పినా ఆ పాప త‌ల్లి ప‌ట్టించుకోలేద‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌లువురు రాజ‌కీయ పార్టీల నేత‌లు కోరుతున్నారు.

Tags:    
Advertisement

Similar News