అయోధ్యకు లక్షల్లో భక్తులు.. కోట్లలో కానుకలు
ఈ 10 రోజుల్లో రామ మందిరానికి 11.50 కోట్ల రూపాయల కానుకలు వచ్చాయి. ఇందులో మందిరానికి వచ్చే మార్గంలో ఏర్పాటు చేసిన 4 హుండీల్లోనే ఏకంగా 8కోట్ల రూపాయలు పడ్డాయి.
భవ్య రామమందిర నిర్మాణంతో అయోధ్యాపురి భక్తజన సందోహంతో కళకళలాడిపోతుంది. బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగిన జనవరి 22 నుంచి నిత్యం లక్షల మంది భక్తులు బాలక్‌రామ్‌ను దర్శించుకోవడానికి పోటెత్తుతున్నారు. భక్తులు వేసిన కానుకలతో హుండీలు నిండిపోతున్నాయి.
25 లక్షలు దాటిన భక్తులు
ప్రాణప్రతిష్ఠ జరిగిన జనవరి 22 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు రామ మందిరాన్ని 25 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ఇందులో జనవరి 23నే 5లక్షల మందికిపైగా బాల రాముణ్ని దర్శించుకున్నారు. నిత్యం 2 లక్షల మందికిపైగా భక్తులతో తిరుమలను మించిపోతోంది.
11.50 కోట్ల కానుకలు
ఈ 10 రోజుల్లో రామ మందిరానికి 11.50 కోట్ల రూపాయల కానుకలు వచ్చాయి. ఇందులో మందిరానికి వచ్చే మార్గంలో ఏర్పాటు చేసిన 4 హుండీల్లోనే ఏకంగా 8కోట్ల రూపాయలు పడ్డాయి. ఎప్పటికప్పుడు నిండిపోతుండటంతో వాటిని రోజూ తీసి భద్రపరుస్తున్నారు. ఇక ఆన్‌లైన్ కౌంటర్లలో చెక్కులు, డిజిటల్ విరాళాలు మరో మూడున్నర కోట్ల రూపాయలు వచ్చినట్లు ట్రస్ట్ వెల్లడించింది.