వరల్డ్ వైడ్ హెల్త్ ఎమర్జెన్సీగా మంకీపాక్స్.. WHO ప్రకటన
మంకీపాక్స్ కూడా మశూచి తరహాలో ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. లైంగిక సంబంధాలు లేదా సన్నిహితంగా ఉండడం వలన ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే ప్రమాదం ఉంది.
ఆఫ్రికన్ దేశాల్లో మంకీ పాక్స్ వేగంగా విస్తరిస్తుండటంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ - WHO ప్రపంచవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. గడిచిన రెండేళ్లలో WHO హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడం ఇది రెండో సారి. ప్రస్తుతం మంకీపాక్స్ వైరస్ ఆఫ్రికన్ దేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది. ఇతర ఖండాలకు విస్తరించే ప్రమాదం ఉందని WHO ప్రతినిధులు ప్రకటించారు. మొదటగా కాంగోలో మంకీ పాక్స్ మహమ్మారిని గుర్తించగా.. ఇప్పటివరకూ 12 దేశాలకుపైగా విస్తరించింది. 14 వేల మంది మంకీపాక్స్ బారిన పడగా.. 524 మంది ప్రాణాలు కోల్పోయారు.
మంకీపాక్స్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది జంతువులతో పాటు మనుషులకు సోకుతుంది. ఈ వైరస్ ఆర్థోపాక్స్ వైరస్ గ్రూపునకు చెందినది. ఇది సోకిన మొదటి ఐదు రోజుల్లో జ్వరం వస్తుంది. తర్వాత రెండు రోజులకు శరీరంపై దద్దుర్లు కనిపిస్తాయి. మొదటగా ముఖం మీద దద్దుర్లు కనిపించి.. తర్వాత శరీరమంతా వ్యాపిస్తాయి. అరచేయి, అరికాళ్లలోనూ ఈ దద్దుర్లు కనిపిస్తాయి. ఈ దద్దుర్లు చీముతో నిండి ఉంటాయి. మంకీపాక్స్ కూడా మశూచి తరహాలో ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. లైంగిక సంబంధాలు లేదా సన్నిహితంగా ఉండడం వలన ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే ప్రమాదం ఉంది.
1958లో తొలిసారి డెన్మార్క్‌లో కోతులలో ఈ వైరస్ గుర్తించడంతో దీనికి మంకీపాక్స్ అని పేరు పెట్టారు. మనుషులకు సంబంధించి 1970లో కాంగోలో 9 నెలల బాలుడిలో గుర్తించారు. ఇక ఈ వ్యాధికి నిర్ధిష్టమైన యాంటీ వైరల్ చికిత్స లేదు. ఎలాంటి ప్రత్యేకమైన వ్యాక్సిన్ లేదు. మశూచికి ఇచ్చే వ్యాక్సిన్ 85 శాతం పని చేస్తుందని WHO చెప్తోంది.