ప్రధాని చెబితే ప్రజలు తప్పకుండా వింటారు

ఆయన అసాధారణ ప్రతిభ కలిగిన నిజాయితీపరుడని అభివర్ణించిన నాటి అమెరికా అధ్యక్షుడు ఒబామా

Advertisement
Update:2024-12-27 11:40 IST

సరికొత్త ఆర్థిక సంస్కరణలతో దేశానికి దిశ, దశ చూపిన ప్రధానిగా మన్మోహన్‌ సింగ్‌ను ఈ చరిత్ర ఎన్నటికీ గుర్తుంచుకుంటుంది. ఇక ఆయన హయాంలో అమెరికాతో జరిగిన అణు ఒప్పందం పెను సంచలనమే. కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ సహా సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన దానిపై ఆయన ధైర్యంగా ముందుకెళ్లారు. తన మైనార్టీ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉప సంహరించుకుకొని హెచ్చరికలు జారీ చేసినా వెరవకుండా 2008లో అగ్రరాజ్యంతో అణు ఒప్పందం చేసుకున్నారు. అందుకే.. నాటి అమెరికా అధ్యక్షుడు ఒబామాకు మన్మోహన్‌ అంటే ప్రత్యేక అభిమానం

ఈ ఒప్పందం కుదిరిన రెండేళ్ల తర్వాత కెనడాలోని టొరంటో వేదికగా జీ20 సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఒబమా మాట్లాడుతూ మన్మోహన్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రధాని చెబితే ప్రజలు తప్పకుండా వింటారనే మాటను మీరు నిజం చేశారని ఈ వేదికపై నుంచి నేను బలంగా చెబుతున్నా అని ప్రశంసించారు.

ఆ తర్వాత తాను రాసిన 'ఎ ప్రామిస్డ్‌ ల్యాండ్‌' పుస్తకంలోనూ మన్మోహన్‌ గురించి ఒబామా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన అసాధారణ ప్రతిభ కలిగిన నిజాయితీపరుడు అని అభివర్ణించారు. భారత ప్రజల శ్రేయస్సు, ఆర్థిక సంస్కరణల కోసం ఆయన నిబద్ధతతో పనిచేశారని ప్రశంసించారు. తన సంస్కరణలతో ఎంతోమందిని పేదరికం నుంచి బైటికి తీసుకొచ్చారన్నారు. తెలివైన, ఆలోచనాత్మకమైన, కపటం లేని నిజాయితీతో కూడిన వ్యక్తిత్వం మన్మోహన్‌ సొంతమని కొనియాడారు.

1998లో భారత్‌ పోఖ్రాన్‌ 2 అణుపరీక్షలు నిర్వహించింది. దీనిపై అప్పట్లో అగ్రరాజ్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ అటామిక్‌ ఎనర్జీ ఏజెన్సీ మనపై పాక్షిక ఆంక్షలు విధించింది. అయితే, అమెరికాతో మన్మోహన్‌ చేసుకున్న అణు ఒప్పందం తర్వాత భారత్‌పై ఉన్న ఈ ఆంక్షలు తొలిగిపోయాయి. 

Tags:    
Advertisement

Similar News