అందరికి సరిపడ ఆహారముంది... కానీ 83కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు

ప్రపంచ జనాభా ఈ రోజుకు 800 కోట్లకు చేరింది. మరో వైపు పెరుగుతున్న పేదరికం , ఆకలి కేకలు, వాతావరణ మార్పుల ఉపద్రవాలు, పట్టణీకరణ‌ వల్ల వస్తున్న అనేక కొత్త సమస్యలతో ప్ర‌పంచం అతలాకుతలమవుతోంది.

Advertisement
Update:2022-11-15 20:41 IST

ప్రపంచ జనాభా ఈ రోజుకు 800 కోట్లకు చేరింది. దీనిని "పౌష్టికాహారం, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, శాస్త్రీయ పురోగతుల మెరుగుదలకు నిదర్శనంగా ఐక్యరాజ్యసమితి తన తాజా నివేదికలో ప్రస్తావించింది.

మరోవైపు ప్రపంచంలో దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. పెరుగుతున్న పేదరికం , ఆకలి కేకలు, వాతావరణ మార్పుల ఉపద్రవాలు, పట్టణీకరన వల్ల వస్తున్న అనేక కొత్త సమస్య‌లు, పెరుగుతున్న వృద్దుల జనాభా వంటి సమస్యలతో ప్ర‌పంచం అతలాకుతలమవుతోంది.

పేదరికం

ప్రపంచంలోని ప్రజలు అందరికీ సరిపడా ఆహారం ఉందని ఐక్య రాజ్య సమితి నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. అయితే 82.8 కోట్ల మంది ప్రజలు నేటికీ ఆకలితో అలమటిస్తున్నారు.2019-2022 మధ్య పోషకాహార లోపం బాధితుల సంఖ్య 15 కోట్ల మేర పెరిగింది. 1.4 కోట్ల చిన్నారులు తీవ్ర పోషకాహార సమస్యతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆకలి, తదితర సమస్యల వల్ల 45 శాతం చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. 2021 నాటికి 69.8 కోట్లు (జనాభాలో 9 శాతం) తీవ్ర పేదరికంలో ఉన్నారు. మరో వైపు పంట సాగు నుంచి రిటైల్ చేసే వరకు 14 శాతం, ఇళ్లు, రెస్టారెంట్లు, స్టోర్ల వద్ద 17 శాతం ఆహారం వృథా అవుతోందని ఐక్య రాజ్య సమితి నివేదిక వెల్లడించింది.

నగరీకరణ

ఇప్పటికే పట్టణ జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరుతోంది. వ్యవసాయం దెబ్బతిని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై ప్రభుత్వాలు శ్రద్ద చూపక పోవడంతో పల్లెల నుండి పట్టాణాల‌కు వలసలు ఊహించని రీతిలో పెరుగుతున్నాయి. 2050 నాటికి పట్టణ జనాభా ప్రస్తుతమున్న దాని నుంచి రెండింతలకు పైగా పెరుగుతుంది. ప్రతి 10 మందిలో 7 మంది పట్టణాల్లోనే నివసిస్తారని ఓ రిపోర్టు. పట్టాణాల్లో విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యం లాంటి అనేక సమస్యలు ప్రజల ఆరోగ్యాలపై పెద్ద ఎత్తున ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అనేక కొత్త రోగాలతో ప్రజలు సతమతమవుతున్నారు. మరో వైపు పట్టణ జనాభా పెరుగుతున్నంతగా అవసరమైన మౌలిక సదుపాయాలు పెరగడంలేదు. ఇళ్ళకు, రవాణా వసతులకు, ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాల‌కు డిమాండ్ తీవ్ర స్థాయిలో పెరుగుతోంది. దాంతో సహజ వనరులపై వత్తిడి తీవ్రమైంది.

.

పర్యావరణ అసమతుల్యత‌

పర్యావరణ మార్పులు కూడా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పుల వల్ల అనేక ఉత్పాతాలు ఏర్పడుతున్నాయి. కాలుష్యం, ఉష్ణోగ్రతలు పెరుగడం, తిపానులు, కరవులు...వీటన్నిటి కారణంగా ఈ 50 ఏళ్ళలో యావరేజ్ గా రోజుకు 115 మంది చనిపోతున్నారు. లక్షల కోట్ల రూపాయలు వృథా అవుతున్నాయి.

ప్రపంచంలో రాను రాను వృద్దుల కనాభా కూడా పెరిగిపోతున్నది. ఐదేళ్లు, అంతకంటే తక్కువ వయసున్న చిన్నారుల సంఖ్యతో పోలిస్తే 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి సంఖ్య 2050 నాటికి రెట్టింపు కానుంది. ప్రస్తుతం మనిషు సగటు ఆయుర్దాయం 77.2 ఏళ్లుగా ఉంది దాంతో వృద్దులపై ప్రభుత్వాలు పెట్టాల్సిన ఖర్చు పెరుగుతోంది.

ఇక భారత‌ దేశం విషయానికి వస్తే వచ్చే సంవత్సరానికల్లా మన జనాభా చైనాను దాటిపోయి 140 కోట్ల జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండబోతున్నాం. 2022 అక్టోబర్ వరల్డ్ హంగర్ ఇండెక్స్ ప్రకారం మొత్తం 121 దేశాలో మన దేశం ఆకలి సూచిలో 121 వ స్థానంలో ఉంది. మనకన్నా పేద దేశాలు అని చెప్పుకుంటున్న శ్రీలంక 64, నేపాల్ 81, బాంగ్లా దేశ్ 84, పాకిస్థాన్ 99 వ స్థానాల్లో ఉండటం మన దుస్థితికి అద్దం పడుతోంది.

వచ్చే 30 ఏళ్లలో ప్రపంచ జనాభా వృద్ధి రేటులో 50 శాతానికి పైగా కేవలం 8 దేశాల్లోనే సంభవిస్తుందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. అందులో భారత్ ఒకటి.

భారత‌ దేశంలో అసమానతలు తీవ్ర స్థాయిలో పెరిగిపోతూ ఉన్నాయి. తాజా సర్వే ప్రకారం మన దేశంలో అత్యంత ధనికులైన‌ 10 శాతం మంది జాతీయ ఆదాయంలో 57 శాతాన్ని, 1 శాతం మంది అత్యంత ధనికులు 22 శాతాన్ని సొంతం చేసుకుంటూ ఉంటే, దిగువ శ్రేణిలోని 50 శాతం మంది పొందే వాటా కేవలం 13 శాతం మాత్రమే.ఇక సంపద విషయంలో పరిశీలిస్తే దిగువున ఉన్న 50 శాతం కుటుంబాల వద్ద అసలు సంపద అంటూ ఏదీ లేదు. మధ్యతరగతి వర్గాల వారి వద్ద‌ 29 శాతం సంపద ఉండగా పైన ఉన్న 10 శాతం ధనికుల‌ వద్ద 65 శాతం సంపద ఉంది.1 శాతం ఉన్న అత్యంత ధనికులు వద్ద 33 శాతం సంపద ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా 1980లో భారత్ లో కార్పోరేట్ల దగ్గర 290 శాతం సంపద ఉంటే, 2020నాటికి అది 560 శాతానికి పెరిగింది. అంతే కాదు మధ్యతరగతి వర్గంలో నుంచి పేదరికంలోనికి చేరి పోయే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూఉంది.

మన పాలకులు, జనాభా పెరుగుదల మీద, పోషకాహార లోపం మీదం, పేదరికం, ఆకలి, ఉపాది, పర్యావరణాల మీద దృష్టి పెట్టకుండా తమ స్వప్రయోజనాల కోసం ప్రజలకు, దేశాభివృద్దికి ఏ మాత్రం ఉపయోగంలేని విషయాల చుట్టూ తిరుగుతున్నంత కాలం పరిస్థితి ఇలాగే ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News